BJP పాలిత రాష్ట్రాల్లోని పెట్రోల్ ధరలను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలతో పోల్చుతూ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కన్నా BJP పాలిత రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కన్నా BJP పాలిత రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి.
ఫాక్ట్(నిజం): దేశంలోని లీటర్ పెట్రోల్ ధర తక్కువ ఉన్న రాష్ట్రాల్లో పోస్టులో ప్రస్తావించిన BJP పాలిత రాష్ట్రాలు ఉన్నప్పటికీ, లీటర్ పెట్రోల్ ధర ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో BJP పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్,మణిపూర్,నాగాలాండ్, కర్ణాటక, బీహార్) BJP, వాటి మిత్ర పక్షాలు పాలిస్తున్నవే. కేవలం పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్న BJP పాలిత రాష్ట్రాలలోని ధరలను మాత్రమే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ధరలతో పోల్చుతున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
22 ఫిబ్రవరి 2021 రోజున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తమ సంస్థ పెట్రోల్ పంప్స్ ద్వారా దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో లీటర్ పెట్రోల్ విక్రయిస్తున్న ధరని పరిగణలోకి తీసుకొగా, 22వ తారికున BJP అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 98.6 పైసలుగా ఉంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్ (97.10) , మహరాష్ట్ర (97) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో లీటర్ పెట్రోల్ ని రూ. 84.15 పైసలుగా ఉంది.
దేశంలోని లీటర్ పెట్రోల్ ధర తక్కువ ఉన్న రాష్ట్రాల్లో పోస్టులో ప్రస్తావించిన BJP పాలిత రాష్ట్రాలు ఉన్నప్పటికీ, లీటర్ పెట్రోల్ ధర ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో BJP పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే దేశంలో లీటర్ పెట్రోల్ ధర అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్,మణిపూర్,నాగాలాండ్, కర్ణాటక, బీహార్) BJP, వాటి మిత్ర పక్షాలు పాలిస్తున్నవే. దీన్ని బట్టి కేవలం పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్న BJP పాలిత రాష్ట్రాలలోని ధరలను, పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ధరలతో పోల్చుతున్నారని కచ్చితంగా చెప్పొచ్చు.
ఐతే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటీవల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ₹. 2.5 /Ltr మరియు డీజిల్‌పై ₹.4 /Ltr అగ్రికల్చర్ & డెవలప్మెంట్ సెస్‌ను విధించింది. ఐతే ఈ సెస్ ద్వారా వినియోగదారుడిపై అదనపు భారం పడకుండా సెస్ కి అనుగుణంగా బేసిక్ ఎక్సైజ్ సుంకం (BED) మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) రేట్లు తగ్గించారు. ఐతే ఇలా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్ డ్యూటీ తగ్గడంతో ఈ డ్యూటీలో నుండి రాష్ట్రాలకు వచ్చే వాటా కూడా తగ్గుతుంది, దీని వల్ల రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గుతుంది.
ఇంతకు ముందు కూడా ఇలానే పెట్రోల్ ధరలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో షేర్ అయినప్పుడు FACTLY వాటిని డీబంక్ చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా పెట్రోల్ కి సంబంధించిన మరికొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
చివరగా, ఈ పోస్టులో కేవలం పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్న BJP పాలిత రాష్ట్రాల గురించి మాత్రమే ప్రస్తావించారు.