Fake News, Telugu
 

భారత్ లో కన్నా నేపాల్ మరియు శ్రీలంకలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి

0

పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంకలో కన్నా భారత దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి; పెట్రోల్ పై విధించే టాక్స్ లో రాష్ట్రాలకే ఎక్కువ వాటా వెళ్తుంది; BJP పాలిత రాష్ట్రాల కన్నా BJP ఎతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇలా పలు క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంకలో కన్నా భారత దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి.

ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక లో లీటర్ పెట్రోల్ ధర భారత దేశంలో కన్నా తక్కువగా ఉంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే సమయానికి (26 మే 2014) డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 58.58గా ఉంది, అదే 01 ఫిబ్రవరి 2021 నాటికీ 73 అయింది. పెట్రోల్ మరియు డీజిల్ పై వివిధ కేంద్ర మరియు రాష్ట్ర టాక్స్ ల రూపంలో వసూలు చేసే దాంట్లో ఎక్కువ శాతం కేంద్రానికే వెళ్తుంది. దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు BJP పాలిస్తున్నవే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

శ్రీలంక, నేపాల్ మరియు పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు:

శ్రీలంక మినిస్ట్రీ అఫ్ పెట్రోలియం రిసోర్స్ డెవలప్మెంట్ వెబ్సైటు ప్రకారం ఆ దేశంలో  లీటర్ పెట్రోల్ ధర LKR 161. అంటే భారత కరెన్సీ లో ₹ 60.83 తో సమానం.

Shell కంపెనీ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ లో 01 ఫిబ్రవరి 2021 తేదిన లీటర్ పెట్రోల్ ధర PKR 111.9 గా ఉంది. ఇది భారత దేశ కరెన్సీలో ₹ 50.95.

గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 01 ఫిబ్రవరి 2021 తేదిన నేపాల్ లో లీటర్ పెట్రోల్ ధర ఆ దేశ కరెన్సీలో 110 రూపాలు.  ఇది భారత కరెన్సీ లో ₹ 68. 96 తో సమానం.

క్ర. సందేశంలీటర్ పెట్రోల్ ధర (భారత రూపాయిల్లో 01 ఫిబ్రవరి 2021)  
1పాకిస్తాన్₹50.59
2నేపాల్₹ 68.96
3శ్రీలంక₹ 60.83

దీన్నిబట్టి పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక లో లీటర్ పెట్రోల్ ధర మన దగ్గరి కన్నా తక్కువని కచ్చితంగా చెప్పొచ్చు.

మోదీ కన్నా ముందు, మోదీ వచ్చిన తరవాత డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ:

Reserve Bank of India మరియు Financial Benchmarks India PVT LTD (FBIL) లో డాలర్ తో రూపాయి మారకం విలువకి సంబంధించిన సమాచారం ప్రకారం 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే సమయానికి (26 మే 2014) డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 58.58గా ఉంది. అదే 01 ఫిబ్రవరి 2021 నాటికీ 73 అయింది. దీన్నిబట్టి రూపాయి విలువ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినాక రూపాయి విలువ పెరిగిందనడంలో నిజం లేదు.

పెట్రోల్ మరియు డీజిల్ పై విదించే టాక్స్ లో కేంద్ర మరియు రాష్ట్ర వాట:

పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ క్రింద లిస్ట్ చేసిన నాలుగు విధాలుగా ఎక్సయిజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.

  • బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED) – లీటర్ పెట్రోలుపై రూ. 1.40
  • స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) – లీటర్ పెట్రోలుపై రూ.11
  • అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) – లీటర్ పెట్రోలుపై  రూ. 18
  • అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC) – లీటర్ పెట్రోలుపై  రూ. 2.50

ఐతే ఈ నాలుగింటిలో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే దాంట్లో నుండి రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు, ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్తాయి.  కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40 నుండి మాత్రమే రాష్ట్రాలకు ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదించిన మేరకు 41% వాటా పంచుతారు. ఈ 41% లో నుండి కూడా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్క నిష్పత్తిలో పంచుతారు .

Petroleum Planning & Analysis Cell (PPAC) వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 32.90 ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేస్తుంది. ఐతే ఈ రూ. 32.90లో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే రూ. 31.5 రూపాయలు పూర్తిగా కేంద్రానికే వెళ్తాయి కాబట్టి ఇవి తీసేస్తే మిగిలిన బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ.1.4లో 41%(డివిసబల్ పూల్) మాత్రమే అన్ని రాష్ట్రాలకు (ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన ప్రాతిపదికన ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తిలో)  పంచుతారు, మిగిలిన 59% కేంద్రానికి వెళ్తుంది.

ఐతే ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదించిన మేరకు పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ కి 4.11% మరియు తెలంగాణకు 2.133% వాటా వస్తుంది. అంటే ఈ రూ. 1.4 పైసలలో ఆంధ్రప్రదేశ్ కి 4.11% అనగా సుమారు రూ. 0.02 పైసలు మరియు తెలంగాణకి 2.133% అనగా రూ. 0.01 పైసలు కేంద్రం చెల్లిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశంలో (అన్ని రాష్ట్రాలు కలిపి) అమ్మే పెట్రోల్ మొత్తం మీద వసూలు చేసే కేంద్ర ప్రభుత్వ బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో లీటర్ కి 0.02 పైసలు ఆంధ్ర ప్రదేశ్ కి చెల్లిస్తే తెలంగాణకి 0.01 పైసలు చెల్లిస్తుంది. రాష్ట్రల వాటా తీసేసిన తరవాత మిగిలే రూ. 0.83 తోపాటు సెస్ రూపంలో వసూలు చేసే రూ. 31.5 తో కలిపి మొత్తం రూ. 32.33 పూర్తిగా కేంద్ర ఖజానాకి వెళ్తాయి.

ఉదాహరణకి కేవలం ఒక్క తెలంగాణని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ లో 03 జూన్ 2021 రోజున HP బంక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.11 పైసలుగా ఉంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు మొత్తం విలువ రూ. 59.67 కాగా, ఈ మొత్తంలో కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీ (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్) రూపంలో రూ. 32.33 కేంద్ర ఖజానాలోకి వెళ్తాయి. స్టేట్ VAT(35.2%) కింద రూ. 26.77 + ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద రూ. 0.01 పైసలు మొత్తం కలుపుకొని రూ. 26.78 తెలంగాణ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అంటే హైదరాబాద్ లో మనం కొనే లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో 44.9%(రూ. 26.78) రాష్ట్ర వాటా కాగా కేంద్ర వాటా 54.2%(రూ. 32.33). మిగిలిన 0.92% (రూ. 0.56, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో తెలంగాణా రాష్ట్ర వాటా తీసేసిన తరవాత మిగిలింది) ఇతర రాష్ట్రాలకు పంచుతారు.

BJP పాలిత రాష్ట్రాలకన్నా బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి?

Petroleum Planning & Analysis Cell (PPAC)’ లో అందుబాటులో ఉన్న పెట్రోల్ ధరల సమాచారం ప్రకారం 04 ఫిబ్రవరి 2021 రోజున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తమ సంస్థ పెట్రోల్ పంప్స్ ద్వారా దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో లీటర్ పెట్రోల్ విక్రయిస్తున్న ధరని పరిగణలోకి తీసుకొగా, 04 ఫిబ్రవరి2021 వ తారికున బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54 పైసలుగా ఉంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న మహరాష్ట్ర (93.2), రాజస్తాన్ (92.89) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో లీటర్ పెట్రోల్ ని రూ. 80.52 పైసలుగా ఉంది.

ఐతే బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్న వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో లీటర్ పెట్రోల్ ధర అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, కర్ణాటక, అస్సాం) బీజేపీ మరియు దాని మిత్ర పక్షాలు పాలిస్తున్నవే.

చివరగా, భారత్ లో కన్నా పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంకలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి.

సవరణ (JULY 06, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.

Share.

About Author

Comments are closed.

scroll