1948 లండన్ ఒలింపిక్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టుకి ఆడటానికి 11 జతల బూట్లు కొనివ్వలేకపోయినా, అదే సమయంలో తన కుక్కను మాత్రం నెహ్రూ విమానంలో తిప్పేవాడని చెప్తూ, రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1948 లండన్ ఒలింపిక్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టుకి ఆడటానికి 11 జతల బూట్లు కొనివ్వలేకపోయినా, అదే సమయంలో తన కుక్కను మాత్రం నెహ్రూ విమానంలో తిప్పేవాడని ఫోటోల్లో చూడవొచ్చు.
ఫాక్ట్: ఫుట్‌బాల్ ఫోటో 1948 లండన్ ఒలింపిక్స్ కి సంబంధించిందే, కానీ నెహ్రు ఫోటో 1961 లో తీసినది. బూట్లతో ఆడే అలవాటు అప్పటి భారతీయ జట్టుకి లేకుండేది. AIFF వారు ఇచ్చిన బూట్లను తడి మరియు జారే పరిస్థితుల్లో తప్ప సాధారణంగా భారత జట్టు సభ్యులు వాడేవారు కాదు. అందుకే, 1948 లండన్ ఒలింపిక్స్ మ్యాచ్ లో కేవలం కొంత మంది మాత్రమే బూట్లు వేసుకొని ఆడారు; బూట్లు లేక కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఎడమ వైపు ఉన్న ఫోటోని ‘ది హిందూ’ సంస్థ వారి ‘స్పోర్ట్ స్టార్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఆ ఫోటో 1948 లండన్ ఒలింపిక్స్ కి చెందిందని, ఫోటోలో కుడివైపు బూట్లు లేకుండా ఉన్నది భారత ఫుట్‌బాల్ కెప్టెన్ తలిమెరెన్ అని తెలుస్తుంది. అదే ఫోటోని ‘ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్’ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా 2019 లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ‘Getty Images’ వెబ్ సైట్ లో కూడా ఈ ఫోటోని చూడవొచ్చు.
పోస్ట్ లోని నెహ్రూ ఫోటోని ‘టైమ్స్ కంటెంట్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. 1961 లో ఆ ఫోటోని తీసినట్టు తెలిసింది. ఫోటోలో నెహ్రూ తో ఉన్నది తన కుక్క ‘పెపి’ అని ఆ వెబ్ సైట్ లో చదవొచ్చు.
1948 ఒలింపిక్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు దగ్గర బూట్లు ఉన్నాయా? లేవా?
1948 ఒలింపిక్స్ లో ఫుట్‌బాల్ మ్యాచ్ లు నాకౌట్ విధానంలో జరిగినట్టు బీబీసీ వారి 1948 ఒలింపిక్స్ హ్యాండ్ బుక్ లో చూడవొచ్చు. భారత్ ఫుట్‌బాల్ జట్టు తాము ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఒలింపిక్స్ నుండి వైదొలిగినట్టు అధికారిక 1948 ఒలింపిక్స్ రిపోర్ట్ లో చూడవొచ్చు. కాబట్టి, 1948 ఒలింపిక్స్ లో భారత్ జట్టు ఆడిన ఏకైక మ్యాచ్ లో బూట్లు ఉన్నాయో లేదో చూద్దాం.
భారత్-ఫ్రాన్స్ మ్యాచ్ లో భారత్ జట్టు లో తొమ్మిది మంది బూట్లు వేసుకోకుండా ఆడినట్టు 1948 ఒలింపిక్స్ రిపోర్ట్ లో చదవొచ్చు.
బూట్లలో ఆడే అలవాటు భారతీయ జట్టుకి లేదని, AIFF వారు ఇచ్చిన బూట్లను తడి మరియు జారే పరిస్థితుల్లో తప్ప సాధారణంగా భారత జట్టు సభ్యులు వాడేవారు కాదని ‘స్పోర్ట్ స్టార్’ వెబ్ సైట్ లో చదవొచ్చు. భారత్-ఫ్రాన్స్ మ్యాచ్ ఫోటోల్లో కొంత మంది మాత్రమే బూట్లు వేసుకున్నట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.
భారత్ ఆటగాళ్ళకు బూట్లు లేకుండా ఆడే అలవాటు ఉండేదని, అలా ఆడడం వారి నైపుణ్యానికి దోహదపడేదని, దాదాపు 1952 వరకు ఆటగాళ్ళు బూట్లు లేకుండా అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడేవారని ‘Nation at Play: A History of Sport in India’ పుస్తకంలో చదవొచ్చు. 1954 లో దేశీయ పోటీలలో బూట్లు తప్పనిసరి చేసినట్టు AIFF వెబ్ సైట్ లో చూడవొచ్చు.
1948 సమయంలో ప్రాక్టీసుల్లో కూడా బూట్లు లేకుండా భారత్ ఆటగాళ్ళు ఆడుతున్నట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. బూట్లు లేకుండా ఆడడం పై 1948 భారత ఫుట్‌బాల్ కెప్టెన్ తలిమెరెన్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్ లో మేము ఫుట్‌బాల్ ఆడుతాము, మీరేమో బూట్ బాల్ ఆడుతారు” (“In India, we play football, whereas you play bootball!”), అని అన్నట్టు ఒలింపిక్ ఛానల్ వెబ్ సైట్ లో చదవొచ్చు.
చివరగా, నెహ్రూ బూట్లు కొనివ్వలేదని కాదు, అలవాటు లేక భారత ఫుట్‌బాల్ జట్టు లో చాలా మంది బూట్లు వేసుకోకుండా 1948 ఒలింపిక్స్ లో ఆడారు.