Fake News, Telugu
 

ఆస్ట్రేలియా అసలు పేరు ‘అస్త్రాలయ’ కాదు; లాటిన్ పదం “ఆస్ట్రేలిస్” నుండి ఇది వచ్చింది, దీని అర్థం “దక్షిణం”

0

ఆస్ట్రేలియాను మొదట ‘అస్త్రాలయ’ అని పిలిచేవారని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. దీంట్లో నిజానిలాలు ఏంటో ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఆస్ట్రేలియా అసలు పేరు అస్త్రాలయ, రామాయణ మహాభారత కాలాల్లో అక్కడ అస్త్రాలు దాచేవారు కనుక ఆ పేరొచ్చింది.

ఫ్యాక్ట్ (నిజం): నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రకారం, మ్యాప్‌లో ఆ  ఖండాన్ని వివరించడానికి ఆంగ్ల అన్వేషకుడు మాథ్యూ ఫ్లిండర్స్ ఆస్ట్రేలియా అనే  పేరును మొదటిసారి ఉపయోగించారు. ఆస్ట్రేలియాను శతాబ్దాలుగా ‘టెర్రా ఆస్ట్రేలిస్ ఇంకాగ్నిట’ అని పిలిచేవారు. ‘టెర్రా ఆస్ట్రేలిస్ ఇంకాగ్నిట అంటే ‘తెలియని దక్షిణ భూమి’, ఆస్ట్రేలిస్ అనేది లాటిన్ పదం, దక్షిణం అని ఈ పదం యొక్క అర్థం. ఆస్ట్రేలియా ఒకప్పుడు అస్త్రాలయ అని పిలువబడిందనే వాదనకు మద్దతునిచ్చే ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల, పోస్టులో చెప్తున్నది తప్పు.

ఆస్ట్రేలియా పేరు యొక్క మూలాలు మరియు చరిత్రను తెలుసుకోవడానికి, మేము అధికారిక ప్రభుత్వ సోర్సెస్ వెతికాము. ‘ఆస్ట్రేలియాకు ఎలా పేరు పెట్టారు?’ అనే శీర్షికతో ఉన్న ఒక అర్టికిల్‌లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియా వారు, దక్షిణ అర్ధగోళంలో ఉన్న భూమిని శతాబ్దాలుగా ‘టెర్రా ఆస్ట్రేలిస్ ఇంకాగ్నిట’గా పిలిచేవారని రాశారు. ‘టెర్రా ఆస్ట్రేలిస్ ఇంకాగ్నిట’ అంటే ‘తెలియని దక్షిణ భూమి’ అని అర్థం. ఆస్ట్రేలిస్ అనేది లాటిన్ పదం, దక్షిణం అని ఈ పదం యొక్క అర్థం.

ఆస్ట్రేలియా ఖండాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి మాథ్యూ ఫ్లిండర్స్, 1804లో తాను చేతితో గీసిన ఒక మ్యాప్‌లో ‘ఆస్ట్రేలియా’ అనే పేరును సూచించాడు.

తన పుస్తకం ‘ఎ వాయేజ్ టు టెర్రా ఆస్ట్రేలిస్‌కు’ పరిచయ పేజీలో, అతను ఇలా రాసాడు: ‘ఒక  అసలైన పదం మీద నేను ఏదైనా కొత్త ఆవిష్కరణను అనుమతించుకొంటే, దానిని ఆస్ట్రేలియాగా మారుస్తాను; చెవికి మరింత ఆమోదయోగ్యమైనదిగా మరియు భూమి యొక్క ఇతర గొప్ప భాగాల పేర్లకు సమ్మేళనంగా ఉంటుంది.’ అతని పుస్తకంతో పాటు ఫ్లిండర్స్ మ్యాప్/చార్ట్‌లను కలిపి ‘జనరల్ చార్ట్ ఆఫ్ టెర్రా ఆస్ట్రేలిస్‌ లేదా ఆస్ట్రేలియా అని పిలుస్తారు.’ న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ మాక్వేరీ, ఫ్లిండర్స్ పుస్తకం యొక్క  కాపీని అందుకున్న తర్వాత ఆస్ట్రేలియా అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి. 1820ల చివరి నాటికి దక్షిణ ఖండాన్ని సాధారణంగా ‘ఆస్ట్రేలియా’ అని పిలవడం మొదలైంది.

‘ఆస్ట్రేలియా’ అనే పేరు ఎలా వచ్చిందో మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆస్ట్రేలియాను ఒకప్పుడు అస్త్రాలయగా పిలిచేవారన్న వాదన గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి  మేము ఇంటర్నెట్‌లో వెతికాము. nriafffairs.com కథనం ప్రకారం, హిందూ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ, మహాభారత కాలంలో ఆస్ట్రేలియాను ఆస్త్రాలయ అని పిలిచేవారు అని అన్నారు, దీని అర్థం  ఆయుధశాల అని. అతను ఇలా చెబుతున్న వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది, అది ఇక్కడ చూడవచ్చు. ఆస్ట్రేలియాకు ఆ పేరు ఎలా వచ్చిందో వివరించే ఆస్ట్రేలియన్ ప్రభుత్వ అధికారిక సోర్సెస్ వేటిలోను అస్త్రాలయ గురించి ప్రస్తావించబడలేదు. అందువల్ల పోస్ట్‌లో చెప్తున్నది తప్పు.

చివరిగా, ఆస్ట్రేలియా అసలు పేరు అస్త్రాలయ కాదు; దాని పేరు లాటిన్ పదం “ఆస్ట్రేలిస్” నుండి ఉద్భవించింది, “దక్షిణం” అని దీని అర్థం.

Share.

About Author

Comments are closed.

scroll