“తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి సాలగ్రామం. సంవత్సరానికి ఒకసారి ఇది ప్రజల దర్శనం కోసం ఉంచబడుతుంది” అని చెప్తూ ఒక సాలగ్రామం ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి సాలగ్రామం ఫోటో. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇది ప్రజల దర్శనం కోసం ఉంచబడుతుంది.
ఫ్యాక్ట్ (నిజం): ఈ ఫోటో బెంగళూరుకు చెందిన “Divine Shaligram” అనే ఆధ్యాత్మిక కేంద్రం వారి ఇంట్లో ఉన్న ‘అనంత పద్మనాభ స్వామి’ వారి సాలగ్రామానికి చెందినది. ఇటు వంటి సాలగ్రామ దర్శనం గురించి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ వెబ్సైటులో, మరియు వార్తా కథనాల్లో ఎక్కడా లేదు. తమ ఇంట్లో ఉన్న ఈ సాలగ్రామాన్ని తిరువనంతపురంలోని గుడికి ముడిపెడుతూ 2018 నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆ కేంద్రం వారు మాకు వెల్లడించారు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన వెబ్‌సైటులో సాలగ్రామ ప్రత్యేక దర్శనం గురించి వెతకగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే, ఈ విషయం పైన ఎక్కడా కూడా వార్తా కథనాలు లేవు. అయితే, తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి విగ్రహం 12,008 సాలగ్రామలతో తయారు చేయబడింది అని ఆ దేవస్థానం వెబ్‌సైటులో పేర్కొన్నారు.
ఇక వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 2018 నుంచి ఇదే క్లెయిమ్ తో వైరల్ అవుతుంది అని తెలిసింది. 23 సెప్టెంబర్ 2018లో “శ్రీ అనంత పద్మనాభ సాలగ్రామ” అని చెప్తూ ఇదే ఫొటోని పోస్టు చేశారు. అయితే, ఈ పోస్టు కింద కామెంట్లలో “సాగర్ శ్రీమాలి” అనే వ్యక్తి “ఇది మా సాలగ్రామం” అని చెప్పి పూల తో అలంకరించిన అదే సాలగ్రామం ఫొటోని పోస్టు చేశాడు. ఇక రెండు ఫొటోలను పోల్చగా, రెండిట్లో ఉన్నది ఒకే సాలగ్రామం అని చెప్పవచ్చు.
అయితే, ఈ కామెంట్ చేసిన వ్యక్తి తన ఫేస్బుక్ అకౌంటుని లాక్ చేసి ఉండటంతో, అతనిని సంప్రదించడానికి కుదరలేదు. ఇక ఇదే ఫొటోని 2021లో మరొకరు షేర్ చేయగా, ఆ పోస్టు కింద నాగరాజ్ అనే వ్యక్తి ఈ సాలగ్రామం బెంగళూరులో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఉంది అని , ఇది తిరువనంతపురానికి చెందినది కాదు అని కామెంట్ చేశారు.
ఇక దొరికిన సమాచారంతో ఇంటర్నెట్లో వెతకగా, “Divine Shaligram” అనే పేరుతో బెంగళూరులో ఒక కేంద్రం ఉందని కనుగొన్నాము. దీనికి సంబంధించిన ఫేస్బుక్ ప్రొఫైల్ పరిశీలించగా, 23 సెప్టెంబర్ 2018లో అనంత చతుర్దశి సందర్భముగా షేర్ చేసిన ఫొటోలను ఇక్కడ చూడవచ్చు. అదే రోజున, అలంకరణకు ముందు తీసిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇదే విషయం పైన మేము “Divine Shaligram” వారిని సంప్రదించగా, ఇది తమ ఇంట్లో జరిగిన పూజకు సంబంధించిన ఫోటో అని, 2018 నుంచి కేరళలోని పద్మనాభ ఆలయానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు అని స్పష్టం చేశారు. ఆలాగే, వీరి యూట్యూబ్ ఛానెల్లో కూడా, వివిధ ఆకరాలలో ఉన్న సాల గ్రామాలను ప్రదర్శించడం చూడవచ్చు.
ఇక, తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక సాలగ్రామ దర్శనాలకు సంబంధించిన వివరాల కోసం ఆలయ అధికారులని సంప్రదించాము. వారు స్పందించిన తర్వాత ఈ ఆర్టికల్లో ఆ సమాచారము జత చేస్తాము.
చివరిగా, పై ఆధారాలను బట్టి ఇది బెంగళూరులోని ఒక ఇంట్లో అనంత పద్మనాభ స్వామి సాలగ్రామానికి జరిగిన పూజకి సంబంధించిన ఫోటో అని స్పష్టమైంది. ఇది తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన సాలగ్రామం కాదు.