Fake News, Telugu
 

కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో వికసించిన ‘Zhinzun Qianban’ కమలం అరుదుగా లభించే పుష్పమేమి కాదు

0

కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో అరుదైన వెయ్యి రేకుల సహస్ర పద్మ కమలం వికసించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. చాలా అరుదుగా లభించే ఈ సహస్ర పద్మ కమలం గురించి లలితా సహస్రనామంలో వర్ణించబడిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో చాలా అరుదుగా లభించే వెయ్యి రేకుల సహస్ర పద్మ కమలం వికసించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వెయ్యి రేకుల కమలం వాజపల్లి మహదేవ్ ఆలయంలో వికసించిన మాట వాస్తవమే. కానీ, ‘Zhinzun Qianban’ అని పిలవబడే ఈ కమలం చైనా, వియత్నాం, ఉత్తర భారత దేశంలో సహజంగా వికసిస్తుంది. చైనా పరిశోధకుడు డాయిక్ టీయన్ ఈ వెయ్యి రేకుల పుష్పాన్ని 2009లో సౌత్ చైనా బొటానికల్ గార్డెన్లో (SCBG) కనుగొని, ‘Zhinzun Qianban’ అని పేరు పెట్టారు. పీఎస్‌ ప్రమోద్‌ అనే వ్యక్తి ఈ వెయ్యి రేకుల కమలం యొక్క విత్తనాలని కోల్‌కతా నుండి సేకరించి వాజపల్లి మహదేవ్ ఆలయానికి ఇచ్చారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో తెలుపుతున్న విషయానికి సంబంధించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని మనోరమ వార్తా సంస్థ 2021 జులై నెలలో పబ్లిష్  చేసినట్టు తెలిసింది. కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో సహస్ర పద్మ కమలం వికసించిన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.

వాజపల్లి మహదేవ్ ఆలయంలో పూచిన ఈ ప్రత్యేక కమలానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ మనోరమ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ‘Zhinzun Qianban’ అని పిలవబడే ఈ ప్రత్యేక కమలం యొక్క విత్తనాన్ని పీఎస్‌ ప్రమోద్‌ అనే వ్యక్తి కోల్‌కతా నుండి సేకరించి వాజపల్లి మహదేవ్ దేవాలయానికి ఇచ్చినట్టు తెలిసింది. ఈ కమలం చైనా, వియత్నాం, ఉత్తర భారత దేశంలో అనేక ప్రాంతాలలో వికసిస్తుందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. 

చైనా పరిశోధకుడు డాయిక్ టీయన్ ఈ వెయ్యి రేకుల పుష్పాన్ని 2009లో సౌత్ చైనా బొటానికల్ గార్డెన్లో (SCBG) కనుగొన్నారు. డాయిక్ టీయన్ ఈ పుష్పానికి ‘Zhinzun Qianban’ అని పేరు పెట్టారు. ఈ ‘Zhinzun Qianban’ కమలాన్ని డాయిక్ టీయన్ 2010లో ఇంటర్నేషనల్ వాటర్‌లిలీ అండ్ వాటర్ గార్డెన్ సొసైటీలో రిజిస్టర్ చేసుకున్నారు. చైనా లోని అనేక ప్రాంతాలలో ఈ కమలాలు వికసిస్తాయని తెలిసింది.    

ఈ ‘Zhinzun Qianban’ కమలాన్ని భారత దేశంలో మొట్టమొదట కొచ్చికి చెందిన గణేష్ కుమార్ అనే లోటస్ హైబ్రీడైజర్ పెంచినట్టు తెలిసింది. గణేష్ కుమార్ ‘Zhinzun Qianban’ కమలం విత్తనాన్ని స్వయంగా డాయిక్ టీయన్ దగ్గర తీసుకున్నట్టు మీడియాకి తెలిపారు. ఈ వెయ్యి రేకుల ‘Zhinzun Qianban’ పుష్పాన్ని చాలా మంది భారత దేశంలోని అనేక ప్రాంతాలలో పెంచారు.  

చివరగా, కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో వికసించిన ‘Zhinzun Qianban’ కమలం అరుదుగా లభించే పుష్పమేమి కాదు. 

Share.

About Author

Comments are closed.

scroll