Fake News, Telugu
 

సినిమా ప్రమోషన్ లో ప్రదర్శించిన నకిలీ కరెన్సీ ని బ్రెజిల్ దేశంలో అవినీతి పరులు దోచుకున్న సొమ్మని షేర్ చేస్తున్నారు

0

బ్రెజిల్ ప్రభుత్వం అవినీతిపరులైన రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారుల నుండి ముక్కుపిండి వసూలు చేసిన నాలుగు బిలియన్ డాలర్ల (సూమారు 30 వేల కోట్ల రూపాయలు) అవినీతి సొమ్ముని, వారి పేర్లతో సహా ప్రజల సందర్శన కోసం ఇలా బహిరంగ ప్రదేశంలో ఉంచారు, అంటూ  షేర్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బ్రెజిల్ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు దోచుకున్న అవినీతి సొమ్ముని ప్రజల సందర్శనకి పెట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న డబ్బు బ్రెజిల్ లోని కురిటిబా నగరంలో “Federal Police – The Law is for Everyone” అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ఫేక్ కరెన్సీ. ఈ సినిమా ‘operation Car Wash’ అనే బ్రెజిల్ స్పెషల్ పోలీస్ ఆపరేషన్ ఆధారంగా తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షోట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అవే డబ్బులని చూపిస్తూ ‘National Federation of Federal police’ వారు తమ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియో దొరికింది. ‘Polícia Federal: A Lei é Para Todos (Federal Police – The Law is for Everyone) అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నకిలీ కరెన్సీ ని ఇలా ప్రదర్శించినట్టు వీడియో వివరణలో తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న అవే డబ్బుల యొక్క దృశ్యాన్ని చూపిస్తూ ‘CBN Curitiba’ న్యూస్ ఛానల్ పోస్ట్ చేసిన ట్వీట్ దొరికింది. ఈ ఘటన 2017లో చోటుచేసుకుందని ఈ ట్వీట్ ద్వారా తెలిసింది.

ఈ వివరాల ఆధారంగా ఆ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, కురిటిబా నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకి సంబంధించి ‘ALLMANAQUE’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ‘Operação Lava Jato’ (Operation Car Wash) అనే బ్రెజిల్ స్పెషల్ పోలీస్ ఆపరేషన్ ఆధారంగా తీసిన “Federal Police – The Law is for Everyone” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇలా నకిలీ కరెన్సీ ని ప్రదర్శనకి ఉంచినట్టు అందులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ఆ డబ్బు నకిలీ కరెన్సీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రదర్శించిన నకిలీ కరెన్సీ ని చూపిస్తూ బ్రెజిల్ దేశంలో అవినీతి పరులు దోచుకున్న సొమ్ముని పేర్లతో సహా ప్రదర్శనకి పెట్టినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll