Fake News, Telugu
 

లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన నెంబర్లను ఆంధ్రప్రదేశ్ ‘ఫ్రీ రైడ్’ స్కీంకి ముడి పెడుతున్నారు

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఫ్రీ రైడ్ స్కీం ఆరంభించబోతుందని చెప్తూ, ఈ సౌకర్యం పొందాలంటే ‘1091’ లేదా ‘7837018555’ నెంబర్లకు కాల్ చేయాలి అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఫ్రీ రైడ్ స్కీం ఆరంభించబోతుందని చెప్తూ ఈ సౌకర్యం పొందాలంటే ‘1091’ లేదా ‘7837018555’ నెంబర్లకు కాల్ చేయాలి.

ఫాక్ట్(నిజం): 1091 మరియు 7837018555 హెల్ప్ లైన్ నెంబర్లు పంజాబ్ లోని లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన ‘ఫ్రీ రైడ్’ స్కీంకి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ లో మహిళల మరియు వృద్దుల భద్రత కోసం ఫ్రీ రైడ్ ఫెసిలిటీ ముందునుండే ఉంది. ఐతే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫెసిలిటీని ‘100’ కి డయల్ చేయడం ద్వారా లేక ‘దిశా మొబైల్ అప్లికేషన్ ‘ ద్వారా పొందవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ స్కీం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్లు ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం లూథియానా పోలీసులు మహిళలు రాత్రి వేల సురక్షితంగా ప్రయాణించేందుకు ‘ఉచిత రైడ్’ స్కీం ప్రారంభించింది, ఎవరైనా మహిళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణించేటప్పుడు తమ ఇంటికి చేరడానికి వాహనం దొరకకపోతే 1091, 112 లేదా, 783701855 హెల్ప్ లైన్ నెంబర్లకి డయల్ చేసి ఉచిత రైడ్ ని పొందవచ్చు.

ఐతే హైదరబాద్ లో జరిగిన నిర్భయ ఘటన తరవాత డిసెంబర్ 2019లో ప్రకాశం SP రాత్రి పూట ప్రయాణించే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరేలా ‘అభయ్’ అనే ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా రాత్రి 9 నుండి ఉదయం 5 మధ్యలో ప్రయాణించే మహిళలు ‘100’ కి డయల్ చేస్తే పోలీస్ వారు మహిళలను సురక్షితంగా వారి ఇంటి చేరుస్తారు. దీనికి సంబంధించి మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే మహిళల మరియు వృద్దుల భద్రత నేపధ్యంలో ఈ ఫెసిలిటీని జనవరి 2020 నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా అమలుచేస్తామని, ఈ సదుపాయం కోసం‘100’ డయల్ చేసి కోరవచ్చని ఆంధ్రప్రదేశ్ DGP తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా ‘దిశా మొబైల్ అప్లికేషను’ ప్రారంభించినట్టు వారు తెలిపారు. వీటన్నిటిని బట్టి ఆంధ్రప్రదేశ్ లో మహిళల మరియు వృద్దుల భద్రత కోసం ఫ్రీ రైడ్ ఫెసిలిటీ ముందునుండే ఉన్నప్పటికీ, ఈ ఫెసిలిటీ ‘100’ డయల్ చేసి లేదా ‘దిశా మొబైల్ అప్లికేషన్’ ద్వారా పొందొవచ్చని, పోస్టులో చెప్పిన నెంబర్లు పంజాబ్ లోని లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన ‘ఫ్రీ రైడ్’ స్కీంకి సంబంధించినవని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, పోస్టు లో చెప్పిన నెంబర్లు పంజాబ్ లోని లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన ‘ఫ్రీ రైడ్’ స్కీంకి సంబంధించినవని. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ రైడ్  ‘100’ కి డయల్ చేయడం ద్వారా లేక ‘దిశా మొబైల్ అప్లికేషన్ ‘ ద్వారా పొందవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll