భారతదేశంపై దండయాత్రకు బయలుదేరిన అలెగ్జాండర్‌ను భారతదేశం నుండి రామాయణ & భాగవత గ్రంథాలు, గంగా జలం, గుప్పెడు మట్టి మరియు ఒక గురువును తీసుకురమ్మని అలెగ్జాండర్ గురువైన అరిస్టాటిల్ కోరిన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశం నుండి రామాయణ & భాగవత గ్రంథాలు, గంగా జలం, గుప్పెడు మట్టి మరియు ఒక గురువును తీసుకురమ్మని అలెగ్జాండర్‌ను గురువైన అరిస్టాటిల్ కోరాడు.
ఫాక్ట్ (నిజం): భారతదేశం నుండి ఇలా ఐదు వస్తువులు తీసుకరమ్మని అరిస్టాటిల్ అలెగ్జాండర్‌ను కోరినట్టు ఎటువంటి సమాచారం లేదు, ఒకవేళ నిజంగానే ఇలా జరిగి ఉంటే దీనికి సంబంధించి అనేక చారిత్రక ఆధారాలు ఉండేవి. కానీ, అలాంటివేవి మాకు లభించలేదు. పైగా అలెగ్జాండర్ కేవలం భారత భూభాగంలోని వాయవ్య ప్రాంతం (గాంధార, ప్రస్తుత ఆఫ్ఘానిస్తాన్) వరకే చేరుకున్నాడు. అవి దాటి గంగా నది వరకు అలెగ్జాండర్ రాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
అలెగ్జాండర్ క్రీ.పూ. 327లో భారత్‌పై దండయాత్ర చేశాడు. ఐతే అప్పటికి భారతదేశం ప్రస్తుతం ఉన్నట్టు ఒక్క సంపూర్ణ సామ్రాజ్యంలా కాకుండా వివిధ స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది. మొదట పెర్షియన్ రాజ్యాలను జయించి, ఆ తరవాత పెర్షియన్ సామ్రాజ్యంలో భాగమైన వాయవ్య ప్రాంతం (గాంధార, ప్రస్తుత ఆఫ్ఘానిస్తాన్) ప్రాంతాలపై దండయాత్ర చేసాడు. ఇలా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో వాయవ్య ప్రాంతంలో అంభి మరియు పోరస్ పాలిస్తున్న రాజ్యాలను జయించాడు.
ఆ తరవాత ఇండస్ నది ప్రాంతం వైపు వెళ్ళిన మధ్యలోనే అనేక కారణాల వల్ల తిరిగి గ్రీక్ బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇంతకు మించి అలెగ్జాండర్ భారత భూభాగంలోకి ప్రవేశించలేదు. ముఖ్యంగా, అలెగ్జాండర్ గంగా నది ప్రాంతం వరకు చేరుకున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.
ఐతే తత్వవేత్త అరిస్టాటిల్ చిన్నప్పటినుండి అలెగ్జాండర్ గురువులా వ్యవహరించాడు. అలెగ్జాండర్ రాజకీయాలు, భూగోళశాస్త్రం మొదలైన అంశాలు అరిస్టాటిల్ నుండే నేర్చుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అలెగ్జాండర్ పెర్షియాపై దండయాత్ర చేసినప్పుడు కూడా అరిస్టాటిల్ అందించిన భూగోళశాస్త్రం పరిజ్ఞానం ఉపయోగపడినట్టు తెలుస్తుంది.
ఐతే పోస్టులో చెప్తున్నట్టు భారతదేశంపై దండయాత్రకు భయలుదేరిన అలెగ్జాండర్‌ను భారతదేశం నుండి పోస్టులో చెప్తున్న ఐదు వస్తువులు (రామాయణ & భాగవత గ్రంథాలు, గంగా జలం, గుప్పెడు మట్టి మరియు ఒక గురువును) తీసుకురమ్మని అడిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.
ఒకవేళ ఇలా నిజంగా జరిగి ఉంటే, దీనికి సంబంధించి అనేక చారిత్రక ఆధారాలు ఉండేవి. కానీ, అలాంటివేవి మాకు లభించలేదు. అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంపై పెద్దగా రాజకీయ ప్రాభవం చూపలేదని కూడా కొన్ని పుస్తకాలలో రాసారు, దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నది కల్పితమని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, భారతదేశం నుంచి రామాయణం, భగవద్గీత మొదలైన ఐదు వస్తువులు తీసుకరమ్మని అరిస్టాటిల్ అలెగ్జాండర్‌ను అడిగినట్టు చెప్తున్నది ఒక కల్పిత కథ.