Fact Check, Fake News, Telugu
 

పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో బీజేపీ, వాటి మిత్ర పక్షాలు పాలిస్తున్నవి ఆరు రాష్ట్రాలు ఉన్నాయి

0

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోని పెట్రోల్ ధరలు మరియు బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోని పెట్రోల్ ధరలతో పోల్చుతూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని అర్ధం వచ్చేలా చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

ఫాక్ట్(నిజం): దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో  బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్నవి ఆరు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, కర్ణాటక) ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.50 పైసలుగా ఉంది. దీన్నిబట్టి బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్న వాదనలో హేతుబద్దత లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

‘Petroleum Planning & Analysis Cell (PPAC)’ లో అందుబాటులో ఉన్న పెట్రోల్ ధరల సమాచారం ప్రకారం 29 డిసెంబర్ 2020 రోజున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తమ సంస్థ పెట్రోల్ పంప్స్ ద్వారా దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో లీటర్ పెట్రోల్ విక్రయిస్తున్న ధరని పరిగణలోకి తీసుకొగా, 29వ తారికున బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 91.50 పైసలుగా ఉంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్ (91.09), మహరాష్ట్ర (90.34) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో లీటర్ పెట్రోల్ ని రూ.77.80 పైసలుగా ఉంది.

ఐతే పోస్టులో ప్రస్తావించిన రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఇంచుమించు అలానే ఉన్నా బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్న వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో లీటర్ పెట్రోల్ ధర అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, కర్ణాటక) బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్నవే. పెట్రోల్ పై తమకు నచ్చిన విధంగా టాక్స్ వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఐతే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా టాక్స్ వసూలు చేస్తున్నాయి. తెలంగాణ, ఒడిషా, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ పై డైరెక్ట్ VAT వసూలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కేరళ మొదలైన రాష్ట్రాలు VAT+ కొంత స్థిర ఛార్జ్ వసూలు చేస్తున్నాయి. గుజరాత్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాలు అధనంగా సెస్ కూడా వసూలు చేస్తున్నాయి.

పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్రాల టాక్స్ మరియు పెట్రోల్ పై FACTLY ఇంతకుముందు రాసిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో  బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్నవి ఆరు రాష్ట్రాలు ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll