Fake News, Telugu
 

‘హైదరాబాద్ పాత బస్తీ లో హిందూ మహిళలు బతుకమ్మ ఆడినందుకు అరెస్ట్’ అని పెట్టిన ఈ వీడియో 2018 లో తీసినది

0

‘హైదరాబాద్ పాత బస్తీ లో హిందూ మహిళలు బతుకమ్మ ఆడినందుకు అరెస్ట్’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ పాత బస్తీ లో హిందూ మహిళలు బతుకమ్మ ఆడినందుకు అరెస్ట్. దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: వీడియోలోని ఘటన 2018 లో జరిగింది. ఆ ఘటన ఈ సంవత్సరం బతుకమ్మకి సంబంధించింది కాదు. అంతేకాదు, చార్మినార్ పోలీసువారు కూడా తాజాగా ఎవరిని అలా అరెస్ట్ చేయలేదని FACTLY కి తెలిపారు. కావున, పాత వీడియోని మళ్ళీ షేర్  చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే వీడియోని 2018 లోనే చాలా మంది యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. అదే వీడియోని ‘న్యూస్ 18 – తెలుగు’ వారు పోస్ట్ చేసి, ‘హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర బతుకమ్మ సంబురాలు నిర్వహించేందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళా నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు’, అని రాసారు.

2018 లో వేరే వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఆ ఘటన పై అప్పట్లోనే పలువురు నాయకులు చేసిన కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, చార్మినార్ పోలీసువారు కూడా తాజాగా ఎవరిని అలా అరెస్ట్ చేయలేదని FACTLY కి తెలిపారు.

చివరగా, పోస్ట్ లోని వీడియో 2018 లో అనుమతి లేకుండా చార్మినార్ వద్ద మహిళలు బతుకమ్మ ఆడినప్పుడు పోలీసులు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లినప్పుడు తీసినది.

Share.

About Author

Comments are closed.

scroll