Fake News, Telugu
 

BEE వారు విద్యుత్ ఆదా చెయ్యడం కోసం ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్‌ ఉష్ణోగ్రతని 24°Cకి సెట్ చేయాలని సూచించింది, ఆరోగ్య కారణాలు కోసం కాదు

0

పలు ఆరోగ్య, విద్యుత్ ఆదా మొదలైన కారణాల చేత ఏసీని 26+ డిగ్రీల వద్ద నడపడం ఉత్తమమని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పలు ఆరోగ్య, విద్యుత్ ఆదా మొదలైన కారణాల చేత ఏసీని 26+ డిగ్రీల వద్ద నడపడం ఉత్తమం – విద్యుత్ మంత్రిత్వ శాఖ.

ఫాక్ట్ (నిజం): 01 జనవరి 2020 నుండి భారతదేశంలో తయారైన లేదా విక్రయించే అన్ని రకాల రూమ్ ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీ సెల్సియస్‌కి సెట్ చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2019లో సూచించింది. ఐతే ఇలా చేయడానికి విద్యుత్ ఆదా కారణమని తెలిపాయే తప్ప పోస్టులో చెప్తున్నట్టు ఆర్థరైటిస్, స్కిన్ అలెర్జీ, రక్తపోటు మొదలైన ఆరోగ్య కారణాలు వల్ల ఇలా చేస్తున్నట్టు చెప్పలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE)తో సంప్రదించి 30 అక్టోబర్ 2019న రూమ్ ఎయిర్ కండీషనర్ (RAC) కోసం కొత్త పనితీరు ప్రమాణాలను నోటిఫై చేసింది. 01 జనవరి 2020 నుండి భారతదేశంలో తయారైన లేదా విక్రయించే 10,465 వాట్స్ (9,000 kcal/hour) వరకు కూలింగ్ కెపాసిటీ కలిగిన అన్ని రకాల రూమ్ ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీ సెల్సియస్‌కి సెట్ చేయాలని ఈ నోటిఫికేషన్ సారాంశం. అంటే మనం ఎయిర్ కండీషనర్‌ని ఆన్ చేసినప్పుడు, అది డిఫాల్ట్‌గా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆన్ అవుతుందన్నమాట.

2019లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయక ముందే 2018లో అన్ని విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ భవనాలు మొదలైన అన్ని వాణిజ్య మరియు పబ్లిక్ భవనాలలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రతను 24-25 డిగ్రీల సెల్సియస్‌ సెట్ చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచించింది.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గాని లేదా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్‌గా ఉష్ణోగ్రత ప్రతిపాదించడానికి ఎనర్జీ కన్జర్వేషన్ (విద్యుత్ ఆదా) కారణమని తెలిపాయే తప్ప పోస్టులో చెప్తున్నట్టు ఆర్థరైటిస్, స్కిన్ అలెర్జీ, రక్తపోటు మొదలైన ఆరోగ్య కారణాలు వల్ల ఇలా చేస్తున్నట్టు చెప్పలేదు.

చివరగా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ కన్జర్వేషన్ (విద్యుత్ ఆదా) కోసం ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్‌ ఉష్ణోగ్రతని 24°Cకి సెట్ చేయాలని సూచించింది, ఆరోగ్య కారణాలు కోసం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll