Fake News, Telugu
 

పరశురాముడు, చాణక్యుడు కల్పిత పాత్రలు అని భారత పురావస్తు శాఖ (ASI) పేర్కొనలేదు

0

పరశురాముడు, చాణక్యుడు కల్పిత పాత్రలు అని ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI) రాతపూర్వకంగా వెల్లడించింది అని చెప్తూ ఉన్న పోస్టులు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI) ఇచ్చిన RTI సమాధానల ఫోటోలు జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పరశురాముడు, చాణక్యుడు కల్పిత పాత్రలు అని ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా(ASI) రాతపూర్వకంగా వెల్లడించింది.

ఫాక్ట్ (నిజం): ఆఫీస్ అఫ్ డైరెక్టర్ (epigraphy), ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI), మైసూర్ వారు తమకు వచ్చిన RTI దరఖాస్తులకు సమాధానంగా కేవలం చాణక్యుడు మరియు పరశురాములకు ముడిపడి ఉన్న చారిత్రక రికార్డులు, వారి ఉనికి,  వారు జీవించి ఉన్న కాలం మరియు వారి రచనలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి శాసనాలు కనుగొనబడలేదని, మాన్యుస్క్రిప్ట్‌లు, రచనలు లేదా ఇతర పురావస్తు కళాఖండాల అధ్యయనం తమ పరిధిలోకి రావు అని మాత్రమే తెలియజేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులలో షేర్ చేస్తున్న భారత పురావస్తు శాఖ (ASI) వారు ఇచ్చిన RTI సమాధానలను జాగ్రత్తగా పరిశీలిస్తే, దరఖాస్తుదారుడు తన RTI దరఖాస్తులో చాణక్యుడు మరియు పరశురాముడి జీవితాలకి సంబంధించిన శాసనాలు, మాన్యుస్క్రిప్ట్‌లు లేదా వారు జీవించిన కాలానికి సంబంధించి ASI వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల, వారి ఉనికికి మద్దతు ఇచ్చే ఏదైనా పురావస్తు ఆధారాలను, ASI ఆర్కైవ్‌లలో ఉన్న చాణక్యుడు మరియు పరశురాముడికి ఆపాదించబడిన ఏవైనా రచనలు లేదా గ్రంథాల యొక్క ధృవీకరించబడిన కాపీలను అందించాలని కోరాడు.

దీనికి స్పందిస్తూ ఆఫీస్ అఫ్ డైరెక్టర్ (epigraphy), ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI), మైసూర్ వారు చాణక్యుడు మరియు పరశురాములకు ముడిపడి ఉన్న చారిత్రక రికార్డులు లేదా వారి ఉనికి, వారు జీవించి ఉన్న కాలం, రచనలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి శాసనాలు కనుగొనబడలేదని, మాన్యుస్క్రిప్ట్‌లు , రచనలు లేదా ఇతర పురావస్తు కళాఖండాల అధ్యయనం ఎపిగ్రఫీ శాఖ, ASI పరిధిలోకి రాదు అని సమాధానం ఇచ్చారు.

ఇదే విషయంపై, మరింత సమచారం కోసం ఆఫీస్ అఫ్ డైరెక్టర్ (epigraphy), ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI), మైసూర్ వారిని సంప్రదించగా చాణక్యుడు మరియు పరశురాముడి జీవితాలకి సంబంధించి RTI దరఖాస్తులు వచ్చిన మాట నిజమే ధ్రువీకరించారు. ఈ RTI దరఖాస్తులకు సమాధానంగా వారికి ముడిపడి ఉన్న చారిత్రక రికార్డుల కానీ, వారి ఉనికి సంబంధించిన లేదా వారు జీవించి ఉన్న కాలానికి సంబంధించిన ఎటువంటి శాసనాలు ఇప్పటి వరకు కనుగొనబడలేదని తెలిపినట్లు మాతో చెప్పారు. అంతే కాకుండా ఆఫీస్ అఫ్ డైరెక్టర్ ఎపిగ్రఫీ శాఖ, ASI వారు  శాసనాలు అనేవి 3వ శతాబ్దం క్రీస్తు పూర్వం నుంచి మాత్రమే వాడుకలో ఉన్నటు, అంతకు ముందు ఎలాంటి శాసనాలు వాడుకలో లేవని పేర్కొన్నారు. తాము కేవలం రాతి మరియు రాగి (కాపర్) శాసనాలు మాత్రమే అధ్యయనం చేస్తామని, తాళపత్ర గ్రంథాలు లేదా ఇతర రచనల అధ్యయనం తమ పరిధిలోకి రాదు అని తెలియజేసారు. ఇదే విషయం RTI సమాధానంలో కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు.

దీన్ని బట్టి , ఆఫీస్ అఫ్ డైరెక్టర్ (epigraphy), ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ASI), మైసూర్ వారు తమకు వచ్చిన RTI దరఖాస్తులకు సమాధానంగా కేవలం తమ దగ్గర సమచారం లేదని మరియు కొన్ని అంశాలు వారి పరిధిలోకి రావు అని మాత్రమే తెలియజేసారు అని నిర్థారించవచ్చు. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ప్రస్తుత పోస్టులు వైరల్ చేస్తున్నారు.

చివరగా, పరశురాముడు మరియు చాణక్యుడు  కల్పిత పాత్రలు అని భారత పురావస్తు శాఖ (ASI) పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll