Fake News, Telugu
 

2019 ఎన్నికల్లో ఇజ్రాయెల్ సైబర్ సంస్థ జోక్యం చేసుకుందని గార్డియన్ పత్రిక రిపోర్ట్ చేయలేదు.

0

భారత్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో EVM హ్యాకింగ్ జరిగినట్టు ఒక ఇజ్రాయెల్ గూడచార సంస్థ తెలిపిందని, UKకి చెందిన ది గార్డియన్ పత్రిక ఒక వార్త ప్రచురించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఒక ఇజ్రాయెల్ గూడచార సంస్థ EVM హ్యాకింగ్ చేసినట్టు ది గార్డియన్ రిపోర్ట్ చేసింది.

ఫాక్ట్(నిజం):  ‘టీమ్ జార్జ్’ సంస్థ తమ సైబర్ సేవలు అందించిన దేశాలలో భారత్ కూడా ఒకటని మాత్రమే ది గార్డియన్ పత్రిక తెలిపింది. టీమ్ జార్జ్’ సంస్థ భారత ఎన్నికల్లో (2019) జోక్యం చేసుకున్నట్టు చెప్పలేదు. ఐతే ఈ సేవలు ఎక్కువగా వాణిజ్య వివాదాలకు సంబంధించి ఫేక్ సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించిందని ది గార్డియన్ రిపోర్ట్ చేసింది. కాకపోతే సంస్థ భారత్‌లో ఈ సేవలను ఎవరికి అందించిందో (ఎన్నికలు/రాజకీయ పార్టీలు/ప్రైవేటు కంపెనీలు) అన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

వివిధ దేశాలలోని 30 వార్తా సంస్థలకు చెందిన ఒక జర్నలిస్ట్‌ల కన్సార్టియం ఇజ్రాయెల్‌కు చెందిన ‘టీమ్ జార్జ్’ అనే ఒక రహస్య కంపెనీపై ఒక అండర్ కవర్ ఇన్వెస్టిగేషన్ చేసింది. UKకి చెందిన ది గార్డియన్ పత్రిక ఈ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించి ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. 2017లో హత్య చేయబడ్డ గౌరీ లంకేష్ పని నుండి ప్రేరణ పొంది ఈ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ది గార్డియన్ పేర్కొంది.

ఈ కథనం ప్రకారం ‘టీమ్ జార్జ్’ అనే ఇజ్రాయెల్ సంస్థ 30కి పైగా దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది. హ్యాకింగ్, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, మొదలైన పద్ధతులలో ఆయా దేశాల ఎన్నికలను ప్రభావితం చేసినట్లు అందులో పేర్కొంది.

‘టీమ్ జార్జ్’ సంస్థను తాల్ హనాన్ అనే 50 ఏళ్ల మాజీ ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్స్‌ ఆపరేటివ్ నడుపుతున్నారు. Advanced Impact Media Solutions (AIMS) అనే ఒక అధునాతన సాఫ్ట్వేర్ ద్వారా సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ రూపొందించడం, బాట్స్ మొదలైనవి ఉపయోగించి ప్రజల అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఈ సంస్థ పలు దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుందని రిపోర్ట్స్ ఉన్నాయి. పలు దేశాల ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు మరియు రాయకీయ పార్టీలకు తాను పని చేసినట్టు తాల్ హనాన్ పేర్కొన్నాడు. తాము ఎలా పని చేస్తామో చెప్పే క్రమంలో పలు దేశాలలోని కొందరు ప్రముఖుల అకౌంట్స్ హ్యాక్ చేసి చూపించినట్టు ది గార్డియన్ తమ కథనంలో రాసుకొచ్చింది.

ఐతే ఈ కథనంలో ఎక్కడ కూడా ‘టీమ్ జార్జ్’ సంస్థ భారత ఎన్నికల్లో (2019) జోక్యం చేసుకున్నట్టు చెప్పలేదు. కాకపోతే ఈ సంస్థ తమ సైబర్ సేవలు అందించిన దేశాలలో భారత్ కూడా ఒకటని తెలిపింది.

ఐతే ఈ సేవలు ఎక్కువగా వాణిజ్య వివాదాలకు సంబంధించి ఫేక్ సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించిందని ది గార్డియన్ రిపోర్ట్ చేసింది. ఇకపోతే  ‘టీమ్ జార్జ్’ సంస్థ భారత్‌లో ఈ సేవలను ఎవరికి అందించిందో (ఎన్నికలు/రాజకీయ పార్టీలు/ప్రైవేటు కంపెనీలు) అన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఈ ఈ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించి ది గార్డియన్ రిపోర్ట్ చేసిన మరిన్ని కథనాలు ఇక్కడ చూడొచ్చు.

ఈ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన వార్తను రిపోర్ట్ చేసే క్రమంలో కొన్ని తెలుగు పత్రికలు ‘టీమ్ జార్జ్’ సంస్థ భారత ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు తప్పుగా రిపోర్ట్ చేసాయి. పోస్టులో చేస్తున్న క్లెయిమ్ ఇలాంటి వార్త కథనాల నుండి సేకరించి ఉండవచ్చు.   

చివరగా, 2019 ఎన్నికల్లో ఇజ్రాయెల్ సైబర్ సంస్థ జోక్యం చేసుకుందని ది గార్డియన్ రిపోర్ట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll