Fake News, Telugu
 

బుర్కా వేసుకున్న అబ్బాయి పోలీసులకు దొరికిన ఈ వీడియో పాకిస్థాన్‌కి సంబంధించినది.

0

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో బుర్కా, హిజాబ్ కి సంబంధించి జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కొంత మంది సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తి బుర్కా తీసి చూస్తే, ఆ బుర్కా వేసుకున్నది ఒక అబ్బాయి ఆని తెలుస్తుంది. ఆ వీడియో భారత్‌కి సంబంధించినట్టు అందరు అనుకునేలా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బుర్కా వేసుకున్న ఒక అబ్బాయి పోలీసులకు దొరికిన ఈ వీడియో భారత్‌కి సంబంధించినది.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో భారతదేశనికి సంబంధించినది కాదు. ఆ వీడియోలో పాకిస్థాన్ దేశానికి చెందిన ‘డాల్ఫిన్ పోలీస్’ వారు వేషాలు వేసుకొని అడుక్కుంటున్న నకిలీ బిచ్చగాళ్ళని పట్టుకుంటున్నారు. కావున, పోస్ట్‌లో ఆ వీడియో ఎక్కడిదో చెప్పకుండా, కర్ణాటకలో బుర్కాకి సంబంధించి జరుగుతున్న ఘటనల నేపథ్యంలో షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి కొన్ని వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ‘Siasat.pk’ అనే పాకిస్థాన్ యూట్యూబ్ ఛానల్ వారు అదే వీడియోని ఫిబ్రవరి 2020లో పోస్ట్ చేసి, ‘Check out these fake beggars caught by Dolphin Force’ (అనువాదం – డాల్ఫిన్ ఫోర్స్ పట్టుకున్న ఈ నకిలీ బిచ్చగాళ్లను చూడండి), అని టైటిల్‌లో రాసినట్టు చదవచ్చు.

పాకిస్థాన్ ‘డాల్ఫిన్ ఫోర్స్’ అధికారుల యూనిఫాం, వీడియోలోని అధికారుల యూనిఫాం ఒకే విధంగా ఉన్నట్టు చూడవచ్చు. కాబట్టి, వీడియోలో ఉన్నది పాకిస్థాన్ ‘డాల్ఫిన్ ఫోర్స్’ అధికారులే అనే నిర్ధారణకి రావచ్చు.

తాజా పరిస్థితుల్లో ఇలాంటి ఇంకో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియో బంగ్లాదేశ్ దేశానికి సంబంధించింది అని చెప్తూ  FACTLY ఇంతకుముందే ఒక ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ రాసింది. ఆ అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, బుర్కా వేసుకున్న అబ్బాయి పోలీసులకు దొరికిన పోస్ట్‌లోని వీడియో పాకిస్థాన్‌కి సంబంధించినది.

Share.

About Author

Comments are closed.

scroll