Fact Check, Fake News, Telugu
 

పెట్రోల్ పై టాక్స్ రూపంలో వసూలు చేసే మొత్తంలో రాష్ట్రాల వాటా 75% అన్న వాదన తప్పు.

0

పెట్రోల్ పై విధిస్తున్న పన్నుల్లో 75% రాష్ట్రలకు మరియు 25% కేంద్రానికి వెళ్తాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెట్రోల్ పై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో 75% రాష్ట్రలకు మరియు 25% కేంద్రానికి వెళ్తాయి.

ఫాక్ట్(నిజం): పెట్రోల్ పై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా టాక్స్ వాసులు చేస్తుంది. తెలంగాణలో పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్స్ లో రాష్ట్రం వాటా 44.90%  కాగా కేంద్రం వాటా 54.20%. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం వాటా 46.51% కాగా కేంద్రం వాటా 52.60%. దీన్నిబట్టి పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్స్ లో రాష్ట్రానికి 75% మరియు కేంద్రానికి 25% అన్న వాదనలో నిజం లేదని అర్ధమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ క్రింద లిస్ట్ చేసిన నాలుగు విధాలుగా ఎక్సయిజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.

  • బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED) – లీటర్ పెట్రోలుపై రూ. 1.40
  • స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) – లీటర్ పెట్రోలుపై రూ.11
  • అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) – లీటర్ పెట్రోలుపై  రూ. 18
  • అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC) – లీటర్ పెట్రోలుపై  రూ. 2.50

బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీని సెంట్రల్ ఎక్సయిజ్ తారిఫ్ ఆక్ట్, 1985 ద్వారా ప్రవేశపెట్టారు. స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (SAED) 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు. ఐతే ఈ ఆక్ట్ లో చెప్పిన దాని ప్రకారం, SAED  కింద వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం సర్ ఛార్జి రూపంలో వసూలు చేస్తారు కాబట్టి, వసూలు చేసే మొత్తం కేంద్రానికే చెందుతుంది. అంటే స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) ద్వారా వసూలు చేసేది డివిజబుల్ పూల్ లోకి రాదు, అంటే ఇందులో రాష్ట్రలుకు ఎటువంటి వాటా ఉండదు.

 ఇక పెట్రోలుపై అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (AED) 1998 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు, దీనినే రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని కూడా అంటారు. ఐతే ఈ 1998 ఫైనాన్స్ ఆక్ట్ ప్రకారం అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసింది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్తుంది, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. ఇదే విధంగా డీజిల్ పై కూడా AEDని 1999 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీంట్లో కూడా రాష్ట్రాలకు వాటా ఉండదు.

చివరగా 2021-22 బడ్జెట్ లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ని ప్రవేశపెట్టారు, ఈ సెస్ కింద వసూలు చేసేది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. అంటే ఈ నాలుగింటిలో కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. మిగతా మూడు రూపాలలో వసూలు చేసే రూ. 31.5 పూర్తిగా కేంద్రానికే వెళ్తుంది.  ఇందులో రాష్ట్రాల వాటా ఉండదు.

Petroleum Planning & Analysis Cell (PPAC) వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 32.90 ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేస్తుంది. ఐతే ఈ రూ. 32.90లో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే రూ. 31.5 రూపాయలు పూర్తిగా కేంద్రానికే వెళ్తాయి కాబట్టి ఇవి తీసేస్తే మిగిలిన బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ.1.4లో 41%(డివిసబల్ పూల్) మాత్రమే అన్ని రాష్ట్రాలకు (ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన ప్రాతిపదికన ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తిలో)  పంచుతారు, మిగిలిన 59% కేంద్రానికి వెళ్తుంది.

ఫైనాన్సు కమిషన్ ప్రకారం కేంద్ర టాక్స్ లో రాష్ట్రాల వాటా

కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే మొత్తంలో(డివిజబుల్ పూల్) రాష్ట్రాలకు 41% వాటా ఉండాలని 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేయగా, కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది. అంటే లీటర్ పెట్రోల్ పై  బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40లో 59% అనగా రూ 0.83 కేంద్రానికి చెందుతుంది, అన్ని రాష్ట్రాలకు కలిపి 41% అనగా రూ 0.57 చెందుతాయి. అంటే నికరంగా ఈరోజున ఒక లీటర్ పెట్రోలుపై కేంద్రం విధించే పన్నులో (ఎక్సయిజ్ డ్యూటీ) అన్ని రాష్ట్రాలకి కలిపి 57 పైసలు వెళ్తాయి, అంటే ఒక రూపాయి కంటే తక్కువ.

ఐతే రాష్ట్రాలకు చెందాల్సిన ఈ  41% లో కూడా ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉండాలో కూడా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ప్రకారం తెలంగాణకు ఈ 41% లో 2.13% వాటా కేటాయించింది. సింపుల్ గా చెప్పాలంటే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో అన్ని రాష్ట్రాలు పంచుకోవాల్సిన 41% అనగా 57 పైసలలో తెలంగాణకి 2.13% అనగా రూ 0.01 పైసల వాటా చెందుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ వాటా 4.11 కింద రూ. 0.02 పైసలు రాష్ట్రానికి చెందుతుంది. రాష్ట్రాల వాటా తీసేసిన తరవాత మిగిలే రూ. 0.83 పైసలతో పాటు సెస్ రూపంలో వసూలు చేసే రూ.31.5 తో కలిపి మొత్తం రూ. 32.33 కేంద్ర ఖజానాకి వెళ్తాయి.

ఐతే పెట్రోలియం ఉత్పతుల పై ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా టాక్స్ విధిస్తుంది. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం 35.20% VAT విదిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31% VAT + రూ.4/ltr VAT + రూ.1/ltr రోడ్ డెవలప్మెంట్ సెస్స్ విధిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధిస్తున్న రూ.4/ltr VAT అనేది ఫిక్స్డ్ కాగా 31% VAT అనేది డీలర్ కి చెల్లించే ధర, ఎక్సయిజ్ డ్యూటీ లేదా డీలర్ కమిషన్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది, ఈ మూడింటిలో లో ఏది పెరిగినా లేదా తగ్గిన దానికి అనుగూణంగా స్టేట్ VAT మారుతువుంటుంది. తెలంగాణ ప్రభుత్వం విధించే VATకి కూడా ఇది వర్తిస్తుంది.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర పరిగణలోకి తీసుకుంటే  

ఉదాహరణకి కేవలం ఒక్క తెలంగాణని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ లో 03 జులై 2021 రోజున HP బంక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.11 పైసలుగా ఉంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు మొత్తం విలువ రూ. 59.67 కాగా, ఈ మొత్తంలో కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీ (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్) రూపంలో రూ. 32.33 కేంద్ర ఖజానాలోకి వెళ్తాయి. స్టేట్ VAT (35.2%) కింద రూ. 26.77 + ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద రూ. 0.01 పైసలు మొత్తం కలుపుకొని రూ. 26.78 తెలంగాణ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అంటే హైదరాబాద్ లో మనం కొనే లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో 44.9%(రూ. 26.78) రాష్ట్ర వాటా కాగా కేంద్ర వాటా 54.2% (రూ. 32.33). మిగిలిన 0.92% (రూ. 0.56, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో తెలంగాణా రాష్ట్ర వాటా తీసేసిన తరవాత మిగిలింది) ఇతర రాష్ట్రాలకు పంచుతారు.

వైజాగ్ లో పెట్రోల్ ధర పరిగణలోకి తీసుకుంటే

ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో 03 జులై 2021 రోజున HP బంక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.50 పైసలు కాగా, ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు మొత్తం విలువ రూ. 61.47 కాగా, ఈ మొత్తంలో కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీ (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్) రూపంలో రూ. 32.33 కేంద్ర ఖజానాలోకి వెళ్తాయి. స్టేట్ VAT (31% VAT + రూ.4/ltr VAT + రూ.1/ltr రోడ్ డెవలప్మెంట్ సెస్స్) కింద రూ. 28.57 + ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద రూ. 0.02 పైసలు మొత్తం కలుపుకొని రూ. 28.59  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. అంటే వైజాగ్ లో మనం కొనే లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో 46.51% (రూ. 28.59) రాష్ట్ర వాటా కాగా కేంద్ర వాటా 52.6% (రూ. 32.33). మిగిలిన 0.89% (రూ. 0.55, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా తీసేసిన తరవాత మిగిలింది) ఇతర రాష్ట్రాలకు పంచుతారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పెట్రోల్ ధర పరిగణలోకి తీసుకుంటే

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 03 జులై 2021 రోజున HP బంక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.69 పైసలు కాగా, ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు మొత్తం విలువ రూ. 63.26 కాగా, ఈ మొత్తంలో కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీ (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్) రూపంలో రూ. 32.33 కేంద్ర ఖజానాలోకి వెళ్తాయి. స్టేట్ VAT (33% VAT + రూ.4.5/ltr VAT + 1% సెస్స్) కింద రూ. 30.36 + ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద రూ. 0.04 పైసలు మొత్తం కలుపుకొని రూ. 30.4  మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. అంటే భోపాల్ లో మనం కొనే లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో 48.05%(రూ. 30.4) రాష్ట్ర వాటా కాగా కేంద్ర వాటా 51.11% (రూ. 32.33). మిగిలిన 0.84% (రూ. 0.53, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో మధ్యప్రదేశ్ రాష్ట్ర వాటా తీసేసిన తరవాత మిగిలింది) ఇతర రాష్ట్రాలకు పంచుతారు.

ఈ ఉదహరణల ద్వారా పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్ర పన్నుల వాటా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉండడం గమనించొచ్చు. ఎందుకంటే కేంద్రం విధించే ఎక్సయిజ్ డ్యూటీలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తి లో వాటా ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ పై విధించే టాక్స్ లో రాష్ట్రాలకు 75%, కేంద్రానికి 25% అన్న వాదన తప్పని మనం తెలుసుకోవొచ్చు.

చివరగా, పెట్రోల్ పై విధించే టాక్స్ లో 75% రాష్ట్రా ఖజానాకి వస్తుందన్న వాదన తప్పు.

నోట్: ఈ ఆర్టికల్ కోసం వాడిన అంకెలన్నీ HPCL వారి రేట్ ప్రకారం లెక్కించడం జరిగింది.

సవరణ (JULY 06, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.

Share.

About Author

Comments are closed.

scroll