Fake News, Telugu
 

హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ హిందూ వేషధారణలో ఉన్న ఈ ఫోటోలు AI వాడి రూపొందించారు

0

సనాతన ధర్మం వైపు అడుగులేస్తున్న హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ అంటూ మెడలో రుద్రాక్షలు, కాషాయ కండువాతో అతను హిందూ వేషధారణలో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మెడలో రుద్రాక్షలు, కాషాయ కండువతో హిందూ మతాన్ని ఆచరిస్తున్న హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ ఫోటోలు.

ఫాక్ట్(నిజం):  ఈ ఫోటోలు నిజమైనవి కావు. భార్గవ్ వలేరా అనే AI ఆర్టిస్ట్, ఈ ఫోటోలను AI ద్వారా రూపొందించాడు. ఈ విషయం అతను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసాడు. పైగా డ్వైన్ జాన్సన్ హిందూ మతానికి మారినట్టు గాని లేక హిందూ వేషధారణలో ఫోటోలు దిగినట్టు గాని ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ హిందూ వేషధారణలో ఉన్న ఈ ఫోటోలు నిజమైనవి కావు. వీటిని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) వాడి రూపొందించారు.

భార్గవ్ వలేరా అనే ఫోటోగ్రాఫర్/AI ఆర్టిస్ట్ ఈ ఫోటోలను రూపొందించాడు. ఐతే ఇవి నిజమైన ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఇవి తాను AI ద్వారా రూపొందించిన ఫోటోలంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసాడు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

అతని సోషల్ మీడియాలో AI ద్వారా తాను రూపొందించిన కొందరి ప్రముఖుల ఫోటోలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

నిజానికి డ్వైన్ జాన్సన్ హిందూ మతానికి మారినా, లేక ఇలా హిందూ వేషధారణలో ఫోటోలు దిగినా, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ కనిపించలేదు. కాబట్టి ఈ ఫోటోలు పైన చెప్పినట్టు AI ద్వారా రూపొందించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ఈ ఫోటోలకు సంబంధించి మరింత స్పష్టత కోసం మేము భార్గవ్ వలేరాను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించగా, ఆ ఫోటోలను తను మిడ్‌జర్నీలో రూపొందించానని తెలిపాడు. ఈ మధ్యకాలంలో ఇలా AI ద్వారా రూపొందించిన ప్రముఖ వ్యక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో నిజమైనవిగా వైరల్ అవుతున్నాయి. అలాంటి కొన్ని ఫోటోలను FACTLY ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన పలు కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ హిందూ వేషధారణలో ఉన్న ఈ ఫోటోలు AI ద్వారా రూపొందించారు.

వివరణ (30 May 2023): ఈ ఆర్టికల్ భార్గవ్ వలేరా మాకు ఇచ్చిన సమాధానంతో అప్డేట్ చేయడం జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll