Fake News, Telugu
 

ఉత్తర్‌ప్రదేశ్‌కి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాలు హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోహింగ్యాలు హిందువుల పై దాడి చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోహింగ్యాలు హిందువుల పై దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 03 మే 2021 నాడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్ జిల్లా సిక్రీ గ్రామంలో ఫాల్ట్ లైన్ ని మార్చడానికి వచ్చిన అనుజ్ కుమార్ అనే లైన్ మాన్ పై ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా దాడి చేసినట్టు తెలిసింది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ 05 మే 2021 నాడు తన ట్వీట్లో షేర్ చేసినట్టు తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లాకి చెందిన ముస్లింలు ఒక లైన్ మ్యాన్ పై దాడి చేస్తున్న దృశ్యాలని ఈ ట్వీట్ లో తెలిపారు. ముజఫర్ నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఈ ట్వీట్ లో తెలిపారు. వీడియోలోని  ఘటన భోపా పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలో జరిగిందని ఒప్పుకుంటూ ముజఫర్ నగర్ పోలీస్ వారు ట్వీట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి భోపా పోలీసులు కేసు నమోదు చేసారని, నిందితులని తొందర్లోనే పట్టుకుంటామని ముజఫర్ నగర్ పోలీసు వారు తమ ట్వీట్ లో తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం కొన్ని పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతకగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ‘Amar Ujala’ న్యూస్ వెబ్సైటు 05 మే 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన 03 మే 2021 నాడు ముజఫర్ నగర్ జిల్లాలోని సిక్రీ గ్రామంలో చోటుచేసుకుందని ఈ ఆర్టికల్ తెలిపింది. సిక్రీ గ్రామంలో ఫాల్ట్ లైన్ ని మర్చడానికి వెళ్ళిన అనుజ్ కుమార్ అనే లైన్ మ్యాన్ పై కొంతమంది గ్రామస్థులు దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. అనుజ్ కుమార్, అతని సహచరులు సల్మాన్ అనే వ్యక్తి  ఇంట్లో కేబుల్ మార్చడానికి నిరాకరించినందుకు, అతని పై సల్మాన్ సన్నిహితులు దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. అనుజ్ కుమార్ సహచరులు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకి సమాచారం ఇవ్వడంతో , పోలీసులు ఘటన స్థలానికి వచ్చి అనుజ్ కుమార్ ని విడిపించట్టు ఆర్టికల్ లో తెలిపారు.

ఈ దాడిలో అనుజ్ కుమార్ కి గాయాలైనట్టు ‘Jagran’ న్యూస్ సంస్థ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ దాడికి సంబంధం ఉన్న నిందితులని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు మీడియాకి తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పశ్చిమ బెంగాల్ కి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఉత్తర్‌ప్రదేశ్‌కి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోహింగ్యాలు హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలని అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll