Fake News, Telugu
 

ఐడి ప్రూఫ్ లేని వారికి వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం 06 మే 2021 కన్నా ముందు ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించలేదు

0

పాకిస్తాన్ నుండి వలస వచ్చి రాజస్తాన్ లో ఉంటున్న హిందువులలో కొందరికి కోవిడ్ సోకినట్టు కొన్ని వార్తా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ‘పాకిస్తాన్ నుండి వచ్చి రాజస్థాన్ లో తలదాచుకుంటున్న హిందువులకు వ్యాక్సిన్ నిరాకరించిన రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తాలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘పాకిస్తాన్ నుండి వచ్చి రాజస్థాన్ లో తలదాచుకుంటున్న హిందువులకు వ్యాక్సిన్ నిరాకరించిన రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం’.

ఫాక్ట్ (నిజం): కోవిడ్ కి సంబంధించి టెస్టింగ్, వ్యాక్సిన్ వంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వస్తున్నాయి. 06 మే 2021 కన్నా ముందు ఎటువంటి ఐడి లేని వారికి వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించలేదు. అందుకే పాకిస్తాన్ నుండి వలస వచ్చి రాజస్తాన్ ఉంటున్న వారికీ ఆధార్ మొదలైన ఎటువంటి ఐడి లేనందువలన ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి వ్యాక్సిన్ అందించలేదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు బట్టడంలో అర్ధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత్ లో కోవిడ్ ని ఎదురుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ని ఒక జాతీయ విపత్తుగా గుర్తించి విపత్తు నిర్వహణ చట్టం, 2005ని దేశం మొత్తంలో అమలులోకి తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 10 కింద కోవిడ్ కి సంబంధించి నిర్ణయాధికారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ కి అందించింది.

కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి అందించే వైద్యం, ఇప్పుడు ప్రజలకు అందిస్తున్న వాక్సిన్ల వంటి అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలే పర్యవేక్షిస్తున్నప్పటికి, ఈ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియమాలు పాటించాలో మొదటినుండి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అందిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఈ మార్గదర్శకాలను పాటిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రజలు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపించుకొనే సమయంలో గాని లేక వ్యాక్సిన్ కోసం CoWIN ఆప్ లో రిజిస్ట్రేషన్ గాని ఏయే ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పించాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు రకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ కింద చూడొచ్చు.

  1. ఆధార్ కార్డు
  2. ఓటరు ఐడి
  3. పాస్పోర్ట్
  4. డ్రైవింగ్ లైసెన్స్
  5. PAN కార్డు
  6. NPR స్మార్ట్ కార్డ్
  7. ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్టు పైన తెలిపిన వాటిలో ఏదైనా ఒక ఐడిని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఐతే పాకిస్తాన్ నుండి వలస వచ్చి లాంగ్ టర్మ్ వీసాలపై రాజస్తాన్ లో ఉంటున్న హిందువులకి కోవిడ్ టెస్ట్లు గాని వ్యాక్సిన్ గాని ప్రభుత్వం అందించట్లేదని కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించినప్పటికీ, ఆధార్ కార్డు లేకపోవడం వల్లనే వీరు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఈ కథనాలలో పేర్కొన్నారు. మొదటి నుండి కోవిడ్ కి సంబంధించి ప్రజలు ఎటువంటి ప్రమాణ పత్రాలు సమర్పించాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తూ వచ్చింది కాబట్టి ఈ విషయంలో రాష్ట ప్రభుత్వాలను తప్పు బట్టడంలో అర్ధంలేదు.

ఐతే ఇలా ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేని వారికి వ్యాక్సిన్ అందించడం కోసం 06 మే 2021 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక SOPని విడుదలచేసింది. ఈ SOPలో ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేని వారికి (వృద్దాశ్రమంలో ఉండేవారు, యాచకులు, రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉండేవారు, ఇంకా అర్హులైన వారు) రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యాక్సిన్ అందించాలో ఇందులో కూలంకషంగా వివరించింది. దీనికంటే ముందు ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేని వారికి వ్యాక్సిన్, టెస్టింగ్ వంటి విషయాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించలేదు కాబట్టే వీరు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే తప్పు బట్టలేము.

చివరగా, ఎటువంటి ఐడి ప్రూఫ్ లేని వారికి వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం 06 మే 2021 కన్నా ముందు ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll