Fake News, Telugu
 

దీపావళిని అమెరికా జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రవేశపెట్టిన బిల్లుని ఇంకా ఆమోదించలేదు

0

దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ అమెరికా ప్రభుత్వం ‘దీపావళి డే’ చట్టాన్ని ఆమోదించిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: దీపావళిని దేశవ్యాప్త సెలవు దినంగా ప్రకటిస్తూ అమెరికా ప్రభుత్వం ‘దీపావళి డే’ అనే చట్టాన్ని ఆమోదించింది.

ఫాక్ట్: 15 మే 2023 న దీపావళిని అమెరికా వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ‘దివాళీ డే’ అనే బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్ మరియు అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ విషయంపై అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) వెబ్‌సైట్లో ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, దీపావళిని అమెరికా వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని 15 మే 2023న గ్రేస్ మెంగ్ అనే మహిళా ప్రజాప్రతినిధి అమెరికా పార్లమెంటులోని దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ‘దీవాళీ డే’ బిల్లుని ప్రవేశపెట్టింది.  

అయితే ఆ బిల్లుని ప్రస్తుతానికి హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బిల్లు చట్టంగా మారాలంటే ముందుగా ప్రతినిధుల సభ, తర్వాత సెనేట్, ఆఖరుగా అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి, అమెరికాలో 11 రోజులను మాత్రమే దేశవ్యాప్తంగా సెలవు దినాలుగా గుర్తిస్తారు.

అయితే గతంలో దీపావళి పండగ రోజుని న్యూయార్క్ లోని కొన్ని బడులు సెలవుగా ప్రకటించాయి మరియు ఇటీవల పెన్సిల్వేనియా రాష్ట్ర అసెంబ్లీ దీపావళి రోజుని సెలవు దినంగా ప్రకటిస్తూ చట్టాన్ని చేసింది.

చివరిగా, దీపావళి రోజుని అమెరికా దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని ప్రవేశపెట్టిన బిల్లుని ఇంకా ఆమోదించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll