Fake News, Telugu
 

జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించలేదు

0

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ‘జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు’ అని లోక్‌సత్తా పార్టీ అధినేత డా. జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు – లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ.

ఫాక్ట్(నిజం): లోక్‌సత్తా పార్టీ అధినేత డా. జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా ఆధారాలు కూడా లభించలేదు. ఇదే విషయాన్నీ ఆయన కార్యాలయం మెయిల్ ద్వారా మాకు స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

‘దాదాపుగా 2 లక్షల కోట్లు DBT (Direct Benefit Transfer) రూపంలో పేదలకు ఇచ్చాం అంటున్న జగన్ ఓడిపోతే మళ్ళీ అవే పథకాలు కొనసాగించేంత పిచ్చివారు కాదు చంద్రబాబు‘ అని చెప్పే క్రమంలో జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు అని జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించినట్టు ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌లో చెప్తున్నారు. ఐతే జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

ఈ విషయానికి సంబంధించి సమాచారం కోసం వెతకగా జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎలాంటి  రిపోర్ట్స్ దొరకలేదు. జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎలాంటి యూట్యూబ్‌ ఇంటర్వ్యూలు కూడా లభించలేదు. సాధారణంగా జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవి కనిపించలేదు.

ఐతే ఈ  విషయానికి సంబంధించి స్పష్టత కోసం జయప్రకాశ్ నారాయణ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (FDR)ను మెయిల్ ద్వారా సంప్రదించగా ఈ వ్యాఖ్యలు జయప్రకాశ్ నారాయణ చేయలేదని వారు అన్నారు. ఈ వ్యాఖ్యలు తాను చేసినట్టు వస్తున్న వార్తలను జయప్రకాశ్ నారాయణ ఖండించినట్టు ఈ మెయిల్‌లో స్పష్టం చేసారు. దీన్నిబట్టి ఈ వ్యాఖ్యలను జయప్రకాశ్ నారాయణకు ఆపాదించారని, నిజానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదని అర్ధమవుతుంది.

ప్రస్తుతం జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు Way2News రిపోర్ట్ చేసినట్టు వారి న్యూస్ టెంప్లేట్‌లో ఒక క్లిప్‌ను షేర్ చేస్తున్నారు. ఐతే నిజానికి Way2News సంస్థ ఈ వార్తను ప్రచురించలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న క్లిప్‌ ఫేక్. దీనిని డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. సాధారణంగా Way2News తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ను కూడా అందిస్తుంది, కాని ప్రస్తుతం వైరల్ అవుతున్న  క్లిప్‌లో ఈ లింక్ లేదు. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్నది ఫేక్ న్యూస్ క్లిప్‌ అని స్పష్టమవుతుంది.

ఈ మధ్య కాలంలో way2news పేరుతో తప్పుడు సమాచారం షేర్ చేస్తున్న ఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. way2news ప్రచురించినట్టు వారి టెంప్లేట్‌తో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఒక ఫేక్ క్లిప్‌ను నిజమైన way2news క్లిప్‌తో పోలిచిన ఉదాహారణ కింద చూడొచ్చు.  ఇలాంటి తప్పుడు సమాచారాన్ని FACTLY డీబంక్ చేస్తూ గతంలో రాసిన కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll