‘(ISIS) తీవ్రవాదుల చెరలో ఉన్న 38మంది యువతులను రెస్క్యూ చేసి విడిపించిన ఇండియన్ ఆర్మీ.’ అని చెప్తూ బంధించబడి ఉన్న ఇద్దరు యువతులను రక్షణ బలగాలు కాపాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ మిషన్‌లో దాదాపు 38 మంది యువతులు, ఎక్కువగా భారత్ మరియు బంగ్లాదేశ్‌కు చెందిన వారు రక్షించబడ్డారని పోస్టులో పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టిల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: ISIS చేతిలో బందీలుగా ఉన్న మహిళలను భారత సైన్యం రక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో రోజావా (ఉత్తర సిరియా)లో ఉమెన్స్ డిఫెన్స్ యూనిట్స్ (YPJ) నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించింది. ఈ ఆపరెషన్‌లో ISIS బలగాల వద్ద బందీలుగా ఉన్న నలుగురు మహిళలను వారు రక్షించారు. కావున పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
మా రీసెర్చ్ ప్రకారం ఈ వీడియో ఉత్తర సిరియాలోని రోజావాలోని మహిళల రక్షణ విభాగాల (YPJ) యొక్క రెస్క్యూ ఆపరేషన్.
వీడియోలో కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ సంఘటనకి చెందిన కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, సెప్టెంబర్ 2022లో రోజావాకు చెందిన మహిళా రక్షణ విభాగం (YPJ) వారు ఒక ISIS శిబిరంలో కిడ్నాప్ చేయబడిన నలుగురు యాజిదీ మహిళలను రక్షించాయి. Seratnews ప్రచురించిన వార్తా కథనంలో ఉన్న వీడియో వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలతో సరిపోతున్నాయి.
YPJ యొక్క అధికారిక YouTube చానెల్ ‘YPJ MEDIA CENTER’లో ఈ రెస్క్యూ మిషన్ యొక్క 7 నిమిషాల 28 సెకన్ల నిడివి గల వీడియోను అప్లోడ్ చేసారు. 05 సెప్టెంబర్ 2022న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో వివరణ బట్టి వారు ISIS వద్ద బందీలుగా ఉన్న నలుగురు మహిళలను రక్షించారు అని తెలుస్తుంది.
అసలు,s ISIS వద్ద బందీలుగా ఉన్న 38 మంది యువతులను భారత రక్షణ దళం విడిపించినట్లు ఏమైనా కథనాలు ఇంటర్నెట్లో ఉన్నాయని అని వెతుకగా, మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ పోస్టులో ఒక కథ అల్లి, ఈ వీడియో భారత రక్షణ దళం చేసిన రెస్క్యూ మిషన్‌కి చెందినది అని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
చివరిగా, సిరియాలోని Women’s Defence Units(YPJ) వారు ISIS కిడ్నాప్ చేసిన మహిళలను కాపాడుతున్న వీడియోను భారత ఆర్మీ చేసిందని తప్పుగా షేర్ చేస్తున్నారు.