Fake News, Telugu
 

వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలోని హిందువులు మేల్కొన్నారని అమెరికన్ ఇంటెలిజన్స్ రిపోర్ట్ ఏదీ పేర్కొనలేదు

0

వేల సంవత్సరాల తరువాత భారత దేశంలో హిందువులు మేల్కొన్నారు. వారిని మేల్కొలిపిన వారు మోదీ”, అని అమెరికా ఇంటెలిజన్స్ రిపోర్ట్ వెల్లడించిందని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలోని హిందువులు మేల్కొన్నారని అమెరికన్ ఇంటెలిజన్స్ తమ రిపోర్టులో వెల్లడించింది.

ఫాక్ట్ (నిజం): నరేంద్ర మోదీని, హిందువులని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అమెరికన్ ఇంటెలిజన్స్ కమ్యూనిటి ఎటువంటి రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల ప్రప్రచారంలో భాగంగా ఒక వేళ ప్రధాని నరేంద్ర మోదీ హిందు జాతీయ ఇతివృత్తాలను ఉద్దేశిస్తూ ప్రచారం చేస్తే, భారత దేశంలో మత కలహాలు చోటు చేసుకునే ఆస్కారముందని అమెరికా ఇంటెలిజన్స్ కమ్యూనిటి తమ ‘వరల్డ్ వైడ్ త్రెట్ అస్సెస్‌మెంట్ రిపోర్ట్ 2019’లో వెల్లడించింది. కానీ, వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలోని హిందువులు మేల్కొన్నారని పేర్కొంటూ అమెరికా ఇంటెలిజన్స్ ఎటువంటి రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ చేస్తున్నట్టు అమెరికన్ ఇంటెలిజన్స్ తమ రిపోరర్టులో నరేంద్ర మోదీ వలన వేల సంవత్సరాల తరువాత భారత దేశంలో హిందువులు మేల్కొన్నారని వెల్లడించిందా అని వెతికితే, నరేంద్ర మోదీని, హిందువులని ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేస్తూ అమెరికన్ ఇంటెలిజన్స్ ఎటువంటి రిపోర్ట్ పబ్లిష్ చేయలేదని తెలిసింది.

2019 భారత సార్వత్రిక ఎన్నికల ప్రచారాలలో భాగంగా ఒక వేళ ప్రధాని నరేంద్ర మోదీ హిందూ జాతీయవాద అంశాలను ఉద్దేశిస్తూ ప్రచారం చేస్తే, భారత దేశంలో మత కలహాలు చోటు చేసుకునే ఆస్కారముందని అమెరికా ఇంటెలిజన్స్ కమ్యూనిటి తమ ‘వరల్డ్ వైడ్ త్రెట్ అస్సెస్‌మెంట్ రిపోర్ట్ 2019’లో వెల్లడించింది. నరేంద్ర మోదీ మొదటి టర్మ్ ప్రభుత్వంలో బీజేపీ అమలుపరిచిన కొన్ని విధానాల వలన బీజేపీ పాలిత రాష్ట్రాలలో మతవిద్వేషాలు తీవ్రతరం చేశాయని, హిందూ జాతీయవాద నాయకులు తాము హిందూ జాతీయవాద ప్రచారాన్ని చేయడం ద్వారా తక్కువ స్థాయి హింసను రెచ్చగొట్టి తమ మద్దతుదారులను ప్రేరిపించాలని భావించే ఆస్కారముందని అమెరికా ఇంటెలిజన్స్ కమ్యూనిటి ఈ రిపోర్టులో వెల్లడించింది.

అమెరికా ఇంటెలిజన్స్ కమ్యూనిటి ఇటీవల విడుదల చేసిన వార్షిక త్రెట్ అస్సెస్‌మెంట్ 2023 రిపోర్టులో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం గతంలో కంటే ఎక్కువగా సైనిక శక్తితో పాకిస్థాన్ కవ్వింపులకు ప్రతిస్పందించే అవకాశముందని తెలిపారు. కానీ, వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలో హిందువులు మేల్కొన్నారని తెలుపుతూ అఅమెరికన్ ఇంటెలిజన్స్ ఎటువంటి రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు.

చివరగా, వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలో హిందువులు మేల్కొన్నారని అమెరికన్ ఇంటెలిజన్స్ కమ్యూనిటి తమ రిపోర్టులో వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll