Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్టర్ల గౌరవ వేతనాల కోసం ఖర్చు చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు

0

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో మొత్తంగా 5700 మంది పాస్టర్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి నెలకు రూ. 5 వేల చొప్పున నెలకు 28 కోట్లు, సంవత్సరానికి 342 కోట్లు, అయిదు సంవత్సరాలకు 20 వేల 520 కోట్లు జీతాలుగా ఇస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ల వేతనాల కోసం సంవత్సరానికి 342 కోట్లు ఖర్చు చేస్తుంది.

ఫాక్ట్ (నిజం): పాస్టర్ల గౌరవ వేతనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన సర్వేలో రాష్ట్రంలో మొత్తంగా 8463 చర్చిలు మాత్రమే గౌరవ వేతనాలకు అర్హత పొందాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి కేవలం 518 చర్చిలు మాత్రమే ఈ గౌరవ వేతనాలకు అర్హత పొందాయి. ఈ క్రమంలో 518 చర్చిలకు నెలకు రూ. 5 వేలు చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.25.9 లక్షలు, సంవత్సరానికి రూ.3 కోట్ల పది లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

2020లో కోరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న పాస్టర్లకు చేయూత అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రూ.5 వేలు ఒకసారి గౌరవ వేతనంగా అందిస్తామని మొట్టమొదట ప్రకటించింది. ఇందులో భాగంగా 29,809 పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున అప్పుడు మొత్తంగా 14.9 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆ తరువాత మైనరిటీస్ యాక్షన్ ప్లాన్ 2021-22లో భాగంగా పాస్టర్లకు ప్రతి నెల రూ.5 వేలు అందిస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనికోసం కలెక్టర్ల నేతృత్వంలో ఒక సర్వే జరుపుతామని ప్రభుత్వం తెలిపింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం అందించే నిబంధనల్లో అనేక మార్పులు చేస్తూ చివరికి గౌరవ వేతనానికి చర్చిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 మే నెలలో తెలిపింది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, పాస్టర్ల గౌరవ వేతనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఎనరోల్‌మెంట్ రిపోర్ట్ దొరికింది. కలెక్టర్ల నేతృత్వంలో జరిపిన ఈ సర్వేలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి మొత్తంగా 8463 చర్చిలు గౌరవ వేతనాలకు అర్హత సాధించాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి కేవలం 518 చర్చిలకు మాత్రమే ఈ గౌరవ వేతనాలకు అర్హత పొందినట్టు తెలిసింది. ఈ క్రమంలో 518 చర్చిలకు నెలకు రూ.5000 చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ. 25.9 లక్షలు, సంవత్సరానికి రూ.3 కోట్ల పది లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది.

2022 ఆగస్టు నెలలో రాష్ట్రంలోని 5196 మంది పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనాలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.59 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పని చెప్పవచ్చు.

చివరగా, తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ల గౌరవ వేతనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి 342 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll