Fake News, Telugu
 

సంస్కృత భాష గొప్పతనాన్ని చెప్తూ ప్రచారంలో ఉన్న ఈ పోస్టులోని చాలా విషయాలు నిరాధారమైనవి

0

“సంస్కృత భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది..” అని చెప్తూ సంస్కృత భాషను వివిధ దేశాలలో అనేక రంగాలలో వాడుతున్నారని, మరియు సంస్కృతం గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సంస్కృత భాష ఎంత గొప్పదో చెప్పే అనేక ఉదాహరణలు. 

ఫాక్ట్: అత్యంత స్పష్టమైన ఉచ్ఛారణ కలిగిన భాష సంస్కృతం అని, సంస్కృత తాళపత్ర గ్రంధాలను పరిశోధన చేస్తున్నాం అని, సంస్కృతాన్ని ఆధారంగా చేసుకొని సూపర్ కంప్యూటరులని నిర్మిస్తున్నాం అని NASA ఎక్కడా పేర్కొనలేదు. భాషలలో పదాలను లెక్కించటానికి ఇప్పటివరకు ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధన కూడా జరగలేదు. భాష మాట్లాడటం వలన వ్యాధి రాకుండా ఉంటుంది అని చెప్పడం కూడా అశాస్త్రీయం. ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లోని పాఠశాలలలో సంస్కృతం కచ్చితంగా బోధించాలని నియమమేమీ లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా National Aeronautics and Space Administration (NASA) సంస్థ వారు సంస్కృతాన్ని అత్యంత స్పష్టమైన ఉచ్ఛారణ కలిగిన భాషగా గుర్తించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక 60,000 సంస్కృత తాళపత్ర గ్రంధాలను NASA పరిశోధనలు చేయడం గురించి గానీ అంతరిక్షంలో వ్యోమగాములకు సంస్కృతంలో సందేశం పంపడం గురించి గాని NASA అధికారిక వెబ్‌సైట్లో మరియు వార్తా కథనాల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అలాగే, 2025, 2034లో సంస్కృతాన్ని ఆధారంగా చేసుకొని NASA సూపర్ కంప్యూటర్లని నిర్మిస్తుందని వచ్చిన పుకారులో ఎంతమాత్రం నిజం లేదని నిరూపిస్తూ FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు.

ఇక ప్రపంచంలో ఉన్న భాషలలో పదాలను లెక్కించటానికి ఇప్పటివరకు ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధన జరగలేదు. భాషలు కాలంతో పాటు రూపాంతరం చెందటం, పదాలు కనుమరుగవడం , కొత్త పదాలు రావడం వంటి సమస్యలు ఉండటం వలన ఒక భాషలోని పదాల సంఖ్యను ఖచ్చితంగా గుర్తించలేము. ఇక ఒక భాష మాట్లాడటం వలన షుగర్, బీపీ వ్యాధులను నివారించవచ్చు అని కానీ లేదా నయం చేయవచ్చు అని వస్తున్న పుకార్లు అవాస్తవం అని వైద్యులు, పరిశోధకులు స్పష్టం చేశారు.

ఇక ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాలలోని పాఠశాల విద్యా ప్రణాళికలను పరిశీలించగా వాటిలో ఎక్కడా కూడా సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధించాలని లేదు. ఇంగ్లండ్ విద్యా ప్రణాళికలో ఏదైనా పురాతన లేదా ఆధునిక విదేశీ భాషను బోధించాలి అని మాత్రమే ఉంది.

ఇందులో భాగంగా, ఇంగ్లండ్ లోని  సెయింట్ జేమ్స్ పాఠశాల 1975 నుంచి సంస్కృతాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చి విద్యార్ధులకు బోధిస్తుంది. అలాగే, ఐర్లాండ్‌లోని ‘జాన్ స్కోటస్ నేషనల్ స్కూల్’ లో కూడా పాఠ్య ప్రణాళికకు అదనంగా విద్యార్ధులకు సంస్కృతాన్ని నేర్పిస్తారు.

చివరిగా, నిరాధారమైన విషయాలను ఉదాహరిస్తూ సంస్కృత భాష గొప్పతనం గురించి ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll