Fake News, Telugu
 

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్

0

13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCPకి 145 సీట్లు, TDP-JSP-BJP(NDA) కూటమికి 29 సీట్లు, కాంగ్రెస్ పార్టీ(INC) మరియు ఇతరులకు కలిపి 01 సీటు వస్తాయని అని ‘PTI (Press Trust Of India)’ సంస్థ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ‘PTI’ సంస్థ YSRCPకి 145 సీట్లు వస్తాయని ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ సర్వే ఫలితాలను ‘PTI’ సంస్థ విడుదల చేయలేదు. 08 మే 2024న PTI సంస్థ యొక్క అధికారిక ఫాక్ట్-చెకింగ్ విభాగం X(ట్విట్టర్)లో ఈ సర్వే ఫలితాలపై స్పందిస్తూ ఈ వైరల్ సర్వే ఫలితాలు ఫేక్ అని, వారి లోగోను వాడి తప్పుగా షేర్ చేస్తున్నారు అని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ‘PTI’ ప్రీ-పోల్ సర్వే ఫలితాల గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ సర్వే ఫలితాలను ‘PTI’ సంస్థ విడుదల చేయలేదు అని తెలిసింది. ఈ వైరల్ ప్రీ-పోల్ సర్వే ఫలితాల పై 08 మే 2024న PTI సంస్థ యొక్క అధికారిక ఫాక్ట్-చెకింగ్ విభాగం X(ట్విట్టర్)లో స్పందిస్తూ “తమ లోగోను వాడి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ‘PTI’ ప్రీ-పోల్ సర్వే ఫలితాల అంటూతప్పుగా షేర్ చేస్తున్నారు” అని ప్రకటన చేసింది.( ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం).

అలాగే, ఇదే విషయాన్ని ‘PTI’ సంస్థ తమ వెబ్‌సైట్‌లో కూడా తెలియజేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ‘PTI’ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుధాకర్ నాయర్ కూడా ఈ వైరల్ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ఫేక్ అని, ‘PTI’కు ఈ సర్వే ఫలితాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, గతంలో ఎప్పుడు అయిన ‘PTI’ సంస్థ ఏదైనా ప్రీ-పోల్ సర్వేలు నిర్వహించిదా అని ఇంటర్నెట్‌లో వెతకగా, ఎప్పుడు ఏ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ సర్వేలు చేసినట్లు రిపోర్ట్స్ లభించలేదు. దీన్ని బట్టి, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేయలేదని నిర్థారించవచ్చు.

అదేవిధంగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థల ప్రీ-పోల్ సర్వే ఫలితాలు అంటూ పలు పోస్టులు వైరల్‌ అయ్యాయి, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll