Fake News, Telugu
 

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మోదీని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని మోదీని విమర్శిస్తూ “మోదీ తన నాలుగేళ్ల పదవీకాలంలో భారతదేశాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టారని మరియు మోదీ కులతత్వంతో వ్యవహరిస్తున్నారు” అని కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ తన నాలుగేళ్ల పదవీ కాలంలో భారతదేశాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టారు – రఘురామ్ రాజన్.

ఫాక్ట్ (నిజం): మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై రఘురామ్ రాజన్ విమర్శనాత్మక పరిశీలనలు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, వైరల్ అవుతున్న వ్యాఖ్యలను రఘురామ్ రాజన్‌ చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఈ కల్పిత వ్యాఖ్యలు రాజన్‌కు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ప్రస్తుత మోదీ నాయకత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నారు. రఘురామ్ రాజన్ అనేక సందర్భాల్లో మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించినప్పటికీ, వైరల్ పోస్ట్‌లో చెప్పినట్టు ప్రత్యేకంగా మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు.

రఘురామ్ రాజన్ 2019లో  మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ అధికారాన్ని మొత్తం తన వద్దనే కేంద్రీకృతం చేసుకున్నారని, ఈ విధమైన పాలన ఆర్థిక సంస్కరణల అమలులో సరిగా పనిచేయదు అని విమర్శించారు. అలాగే 2023లో తన లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టు ద్వారా రాజన్ ప్రత్యేకంగా మొబైల్ తయారీ రంగానికి సంబంధించిన అంశలను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పిఎల్‌ఐ)కి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న వ్యాఖ్యలను రఘురామ్ రాజన్‌ చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వేళ రాజన్ అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వార్తసంస్థలు రిపోర్ట్ చేసేవి. దీన్ని బట్టి ఈ కల్పిత వ్యాఖ్యలు రాజన్‌కు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు అని నిర్ధారించవొచ్చు.

చివరగా, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మోదీని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలను చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll