వెస్ట్ బెంగాల్ లోని ఒక కుటంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసింది ఇతడే అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ ప్రకారం ఫోటోలో ఉన్న ఇద్దరి లో తెల్లటి కుర్తా వేసుకున్న వ్యక్తే ఆ మూడు హత్యలు చేసాడు అని క్లెయిమ్. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్: వెస్ట్ బెంగాల్ లోని ఒక కుటుంబం లో ముగ్గురిని హత్య చేసిన వ్యక్తి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటో లో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి పేరు మెహెది హసన్ రసెల్, ఇతడు బంగ్లాదేశ్ యూనివర్సిటీ లోని ఒక విద్యార్ధి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. అతడి పక్కన తెల్ల కుర్తా వేసుకుని వున్నది అతని తండ్రి. పోస్ట్ లోని ఫోటో అతడి ఫేస్బుక్ అకౌంట్ నుండి తీసుకుని వెస్ట్ బెంగాల్ లో కుటుంబాన్ని ఇతడే హత్య చేసాడని షేర్ చేస్తున్నారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
అక్టోబర్ 8, 2019 న ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్ లో 35-సంవత్సరాల ఒక స్కూల్ టీచర్, అతని భార్య, వాళ్ళ కుమారుడు తమ ఇంట్లో హత్య కాబడ్డారు.
పోస్ట్ లోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా గూగుల్ లో వెతికితే ఎటువంటి వివరాలు లభించలేదు. కానీ, ఫోటో లో బ్లూ షర్ట్ వేసుకొని ఉన్న అతని మొహాన్ని వేరు చేసి గూగుల్ లో వెతికితే ఆ ఫోటో ఒక బంగ్లాదేశ్ న్యూస్ పోర్టల్, ‘Justnewsbd’ లోని ఆర్టికల్ లో కనిపించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, బాంగ్లాదేశ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ యూనివర్సిటీ (BUET) కి సంబంధించిన ఒక విద్యార్ధి, అబ్రార్ ఫహద్, హత్య కేసు లో బంగ్లాదేశ్ చాత్ర లీగ్ (BCL) అనే స్టూడెంట్ సంస్థ, తమ BUET యూనిట్ నుండి 11 మంది లీడర్లు మరియు ఆక్టీవిస్ట్ లని తొలగించిందని తెలుస్తుంది. ఆ పదకొండు మంది పేర్లను ఆర్టికల్ లో రాసినా, ఫోటోలో ఉన్నవ్యక్తి పేరు ఏదో తెలీలేదు.
BUET లో జరిగిన హత్య వివరాల కోసం వెతకగా, ‘The Daily Star’ ప్రచురించిన ఒక ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్ లో BUET విద్యార్ధి హత్యా కేసు లో ఆరోపించబడిన 11 మంది ఫోటోలు లభించాయి. ఆ ఫోటోల ద్వారా పోస్టులోని ఫోటోలో బ్లూ షర్ట్ వేసుకున్న అతని పేరు మెహెది హసన్ రసెల్ అని తెలిసింది.
మెహెది హసన్ రసెల్ యొక్క ఫేస్బుక్ ఆకౌంట్ చూస్తే పోస్ట్ లో పెట్టిన ఫోటోనే అతడు జూన్ 10, 2019న ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటో కింద బంగ్లా లో రాసిన అక్షరాలని ఇంగ్లీష్ లోకి అనువదిస్తే ‘Inspiration …Father’ అని ఉంది. కావున, ఫోటో లో అతని తో పాటు తెల్ల కుర్తా వేసుకున్న వ్యక్తి అతని తండ్రి అని అర్ధం అవుతుంది.
అంతేకాక, ‘Times of India’ ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం, ఆ హత్య కేసుకి సంబంధించి ఉత్పల్ బెహరా అనే వ్యక్తిని అక్టోబర్ 15న పోలీసులు అరెస్ట్ చేసారు అని తెలుస్తుంది.
చివరగా,బంగ్లాదేశ్ కి సంబంధించిన ఫోటోని వెస్ట్ బెంగాల్ లో జరిగిన హత్యా కేసు కి సంబంధించింది గా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?