అయోధ్యలో 22 జనవరి 2024న రామాలయ ప్రతిష్టాపన జరుగనున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు నిర్మించబోయే రామ మందిరం కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో కాకుండా దానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రామ మందిరం వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని చూపిస్తున్న గూగుల్ మ్యాప్ స్క్రీన్‌షాట్‌లను తమ వాదనకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో కాకుండా దానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణం గతంలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే జరుగుతోంది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. మీడియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల ప్రతిపక్ష నాయకులు కొందరు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో కాకుండా, మూడు కిలోమీటర్ల దూరంలో జరుగుతోందని ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
ఐతే ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు ఆలయం నిర్మిస్తున్నది గతం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలోనే. ముందుగా 2019లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులో బాబ్రీ మసీదు స్థానంలోనే రామ మందిరం నిర్మించుకోవచ్చని తెలిపింది. కాబట్టి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మందిరాన్ని వేరే స్థలంలో నిర్మించే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా రామ మందిర నిర్మాణం వేరే చోట జరిగుతుంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ, మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవి లభించలేదు. మీడియా కూడా కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే రామ మందిర నిర్మాణం జరుగుతుందని ధృవీకరిస్తుంది.
అయోధ్య రామ మందిర శాటిలైట్ ఫోటోలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్ధమవుతుంది. ఉదాహారణకి, కింద ఉన్న ఫోటోలలో మొదటిది గతంలో బాబ్రీ మసీదు యధాతథంగా ఉన్నప్పటి ఫోటో కాగా, రెండవది 2011లో ఇంకా నిర్మాణం మొదలు కాని అయోధ్య రామ మందిర ప్రదేశం యొక్క శాటిలైట్ ఫోటో (గూగుల్ ఎర్త్ ప్రో ద్వారా పొందినవి). ఈ రెండు ఫోటోలను పోల్చినప్పుడు బాబ్రీ మసీదు చుట్టుపక్కల ఉన్న కట్టడాలను 2011నాటి శాటిలైట్ ఫోటోలలో కూడా చూడొచ్చు.
కాగా 2011నాటి శాటిలైట్ ఫోటోల ప్రకారం అయోధ్య రామ మందిర ప్రదేశం యొక్క కోఆర్డినేట్స్ (26°47’43″N 82°11’39″E)గా చూపిస్తుంది.
ఇప్పుడు అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామ మందిర శాటిలైట్ ఫోటోను (గూగుల్ ఎర్త్ ద్వారా పొందిన) కింద చూడొచ్చు. గూగుల్ ఎర్త్ ప్రకారం రామ మందిర కోఆర్డినేట్స్ 26°47’47″N 82°11’35″E. ఐతే ఈ కోఆర్డినేట్స్ మరియు 2011 కోఆర్డినేట్స్ రెండు ఒకేలా ఉండడం గమనించొచ్చు. అంటే దీన్నిబట్టి ఇప్పుడు రామ మందిరం నిర్మిస్తున్నది కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే అన్న విషయం స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి కొంత దూరంలో ఉన్న మరొక గుడిని కొందరు గూగుల్ మ్యాప్స్‌లో కూల్చేసిన బాబ్రీ మసీదు పేరుతో ట్యాగ్ చేయడంతో రామ మందిరాన్ని కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించట్లేదు అన్న వాదనకు దారి తీసింది. ప్రస్తుతం షేర్ అవుతున్న గూగుల్ మ్యాప్స్ ఫోటోలో బాబ్రీ మసీదు పేరుతో ఉన్నది నిజానికి ఒక హిందూ గుడి.
చివరగా, ప్రస్తుతం అయోధ్యలో గతంలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే రామ మందిర నిర్మాణం జరుగుతోంది.