“భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని మరియు దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు” అని దలైలామా అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని మరియు దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు.” అన్న దలైలామా.
ఫాక్ట్: “భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని, దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు.” అని దలైలామా అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దలైలామా లౌకికవాదం యొక్క ఆచరణను సమర్థించారు, ఇది భారతదేశానికి “మంచి ఫలితాలను” తెచ్చిందని, “కొన్ని మినహాయింపులు ఉన్నా” చాలా స్థిరమైనదని ఆయన అభివర్ణించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, దలైలామా అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు గనక దలైలామా చేసి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. దలైలామా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ – ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్– గానీ, వెబ్సైటులో గానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు దొరకలేదు.
దలైలామా లౌకికవాదం యొక్క ఆచరణను సమర్థించారు, ఇది భారతదేశానికి “మంచి ఫలితాలను” తెచ్చిందని, “కొన్ని మినహాయింపులు ఉన్నా” చాలా స్థిరమైనదని ఆయన అభివర్ణించారు. “భారతదేశం లౌకిక సంప్రదాయాన్ని అనుసరిస్తుంది; ఇది అన్ని మతాలను గౌరవిస్తుంది, అవిశ్వాసులను కూడా సమానంగా గౌరవిస్తుంది, ఇది ప్రత్యేకమైనది. సోదరభావంతో వివిధ మతాలు కలిసి బతకటం భారత దేశం యొక్క గొప్పతనం.” అని దలైలామా అన్నట్టు బిజినెస్ స్టాండర్డ్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
చివరగా, “భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని, దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు.” అని దలైలామా అనలేదు.