Fake News, Telugu
 

భారత్ మొదటి అణు పరీక్ష 1974లోనే నిర్వహించింది

0

ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్‌ యొక్క అణుశక్తికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ను అణుశక్తిగా మార్చింది 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అని క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి విస్తృతంగా షేర్ అవుతుంది. ఇలా భారత్‌ అణుశక్తిగా లేకపోయి ఉంటే ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా ఉక్రెయిన్ లాగా ఉండేదని కూడా పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: భారత్‌ను అణుశక్తిగా మార్చింది 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన అణు పరీక్షలు ద్వారా తాము అణ్వాయుధ పరీక్షలు చేసినట్టు భారత్ మొదటిసారిగా ప్రకటించుకుంది. ఐతే కేవలం దీని ఆధారంగా భారత్‌ను అణుశక్తిగా మార్చింది వాజ్‌పేయి ప్రభుత్వమని అనలేము, ఎందుకంటే 1998 కన్నా ముందే 1974లో  భారత్ మొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించింది. ఐతే ఈ పరీక్షలు కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐతే 1974 అణు పరిక్షల నిర్వహించడం వల్ల భారత్ పలు దేశాల నుండి ఆంక్షలు ఎదురుకోవాల్సి వచ్చింది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) స్వదేశీ సాంకేతికతతో అణు రియాక్టర్లను డెవలప్ చేసింది, దీన్నిబట్టి భారత్‌లో 1998 కన్నా అణుశక్తి అందుబాటులో ఉందని అర్ధమవుతుంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 11 మే1998న భారత్ ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో ఐదు అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా తాము అణ్వాయుధ పరీక్షలు చేసినట్టు భారత్ మొదటిసారిగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం 11 మేను నేషనల్ టెక్నాలజీ డేగా గుర్తిస్తారు.

ఐతే కేవలం దీని ఆధారంగా భారత్ 1998లో అణుశక్తిగా మారిందన్న వాదనలో హేతుబద్దత లేదు, ఎందుకంటే భారత్ అణు పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. అంతకన్నా ముందే 1974లో  ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘స్మైలింగ్ బుద్దా’ పేరుతో భారత్ తన మొదటి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఐతే ఈ పరీక్షలు కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని భారత ప్రభుత్వం ప్రకటించింది. కెనడా మరియు అమెరికా సహాయంతో భారత్ ఈ పరీక్షలు నిర్వహించింది.

ఈ పరీక్షల ద్వారా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు కాకుండా అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇందువల్ల భారత్ అణు సామర్థ్యాల గురించి ఈ పరీక్షల అనంతరం మొదటిసారి ప్రపంచానికి తెలిసిందని చెప్పవచ్చు.

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 1998లో భారతదేశం జరిపిన అణు పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించిన దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. ఉక్రెయిన్ సహా పలు దేశాలు భారత్ తమ అణ్వాయుధ పరీక్షలు నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా తీర్మానం చేసాయి.

ఐతే 1974 అణు పరిక్షల నిర్వహించడం వల్ల భారత్ పలు దేశాల నుండి ఆంక్షలు ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ పరీక్షల అనంతరం కెనడా కూడా భారత్‌కు అణు ఎగుమతులను నిలిపేసింది. ఐతే ఆ తరవాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) స్వదేశీ సాంకేతికతతో అణు రియాక్టర్లను డెవలప్ చేసింది, దీన్నిబట్టి భారత్‌లో 1998 కన్నా అణుశక్తి అందుబాటులో ఉందని అర్ధమవుతుంది.

1974లో భారత్ అణు పరీక్షలు నిర్వహించిన కారణంగా, భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా అణు వ్యాప్తిని నిరోధించడానికి మరియు అణ్వాయుధాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు మరియు సాంకేతికత ఎగుమతిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు 1974లో న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (NSG) అనే సంస్థను ఏర్పాటు చేసారు, ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అంతకుముందు అణు వ్యాప్తిని తగ్గించేందుకు 1970లో ఏర్పాటు నాన్ ప్రోలిఫేషన్ ట్రీటీ (NPT) మరియు అణ్వాయుధ పరీక్ష లేదా ఇతర అణు పేలుడును నిషేధించేందుకు 1996లో  ఏర్పాటు చేసిన కాంప్రీహేన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ (CTBT)లో కూడా భారత్‌కు సభ్యత్వం లేదు.

చివరగా, భారత్ మొదటి అణు పరీక్ష 1974లోనే నిర్వహించింది. కాబట్టి 1998లో భారత్ అణుశక్తిగా మారిందన్న వాదన కరెక్ట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll