కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షను మతోన్మాదులు అతి కిరాతకంగా చంపిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ వీడియో షేర్ అవుతోంది. కర్నాటక షిమోగాలో ఇటీవల బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షను చంపుతున్నప్పుడు తీసిన సీసీటీవీ వీడియో దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, రాజస్తాన్ బికనేర్ నగరంలో జరిగిన ఒక పాత ఘర్షణ దృశ్యాలని చూపిస్తుంది. 03 జనవరి 2022 నాడు బికనేర్ నగరంలో కొందరు ముస్లిం వ్యక్తులు రోడ్డుపై ఒక యువకుడిని తుపాకితో కాల్చి, ఆ తరువాత అతనిపై కత్తులతో దాడి చేసారు. బికనేర్ నగరం అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక అద్దె షాపుకు సంబంధించి రెండు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం, ఈ దాడికి దారి తీసినట్టు తెలిసింది. ఈ వీడియోకి బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని రాజస్తాన్ బీజేపి నాయకుడు లక్ష్మికాంత్ భరద్వాజ్ 04 జనవరి 2022 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. రాజస్తాన్ బికనేర్ నగరంలో సాజిద్, సిద్దిక్, ఫిరోజ్, ఇర్ఫాన్, షారుఖ్ అనే ముస్లిం వ్యక్తులు తేజ్‌కరన్ అనే యువకుడిని తుపాకితో కాల్చి రోడ్డుపై కిరాతకంగా దాడి చేసిన దృశ్యాలంటూ ఈ ట్వీట్లో తెలిపారు. ఈ ట్వీట్‌కి బికనేర్ పోలీస్ బదులిస్తూ, ఇది ఒక అద్దె షాపు ఖాళీ చేయడానికి సంబంధించి రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అని, ఈ ఘటనకు సంబంధించి కేసు రిజిస్టర్ అయినట్టు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ అలాగే, వీడియోలని పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వీడియోలోని ఘటన 03 జనవరి 2022 సాయంత్రం చోటుచేసుకుందని ఈ న్యూస్ రిపోర్టులలో తెలిపారు. బికనేర్ నగరం అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక అద్దె షాపుకి సంబంధించి రెండు వర్గాల మధ్యల తలెత్తిన వాగ్వాదం, ఈ దాడికి దారి తీసినట్టు ఈ న్యూస్ రిపోర్ట్స్ స్పష్టం చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, రాజస్తాన్ బికనేర్ నగరంలో జరిగిన పాత ఘర్షణ వీడియోని కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు ముడిపెడుతున్నారు.