Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ప్రారంభిస్తామని కాంగ్రేస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేయలేదు

0

‘ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తాను గనుక అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ప్రారంభిస్తామని వాగ్దానం చేసింది’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తాను గనుక అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ప్రారంభిస్తామని వాగ్ధానం చేసింది.

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తమ మేనిఫెస్టోలో (ఉన్నతి విధాన్) రాష్ట్రంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామంటూ ఎటువంటి వాగ్ధానం చేయలేదు. పైగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామంటూ వాగ్దానాలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ‘ఉన్నతి విధాన్’ పేరుతో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐతే పోస్టులో ఆరోపిస్తునట్టు ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ప్రారంభిస్తామన్న హామీ ఏమి లేదు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా సందర్భాలలో ఇలాంటి వాగ్ధానాలు చేసినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వార్తా సంస్థలు ఈ విషయాన్ని అన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కానీ అలాంటి రిపోర్ట్స్ ఏవి కూడా మాకు లభించలేదు. కాబట్టి పోస్టులో చేస్తున్న వాదన నిజం కాదని స్పష్టమవుతుంది.

ఐతే ఈ నెలలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఒక ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలని కోరినట్టు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నాయకుడు అకీల్ అహ్మద్ వ్యాఖ్యానించినట్టు వార్తా కథనాలు ఉన్నాయి. ఐతే ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ ఉత్తరాఖండ్ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఎటువంటి ప్రస్తావన చేయలేదు.

‘ఉత్తరాఖండ్ స్వాభిమాన్ ప్రతిజ్ఞ పత్ర’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు, కాని ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ప్రారంభిస్తామని కాంగ్రేస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll