Fake News, Telugu
 

కాలేజీ ఫ్రెషర్స్ పార్టీకి సంబంధించిన వీడియోని బిపిన్ రావత్ మరణించినందుకు సంబరాలు చేసుకున్నారంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల 08 డిసెంబర్ 2021న తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన విషయం తెలిసిందే. ఐతే బిపిన్ రావత్ మరణించినందుకు ఆ రోజు కోయంబత్తూరులోని ఒక కాలేజీ హాస్టల్‌లో ముస్లిం విద్యార్థులు సంతోషంతో డీజే పార్టీ ఏర్పాటు చేసి డాన్స్ చేసారని చెప్తూ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: జనరల్ బిపిన్ రావత్ మరణించినందుకు కోయంబత్తూరులోని ఒక కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు సంతోషంతో డాన్స్ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది 07 డిసెంబర్ 2021న కునియముత్తూరు, కోయంబత్తూరు ప్రాంతంలోని నెహ్రు కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు. ఈ పార్టీ జనరల్ బిపిన్ రావత్ మరణించిన ఒక రోజు ముందు జరిగిందని, ఈ పార్టీకి బిపిన్ రావత్ మరణానికి ఎటువంటి సంబంధంలేదని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటన జారీ చేసింది. కాలేజీ యాజమాన్యం కంప్లైంట్ ఆధారంగా ఫేక్ న్యూస్ షేర్ చేసిన కేరళకు చెందిన ‘కర్మ న్యూస్’ అనే యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయినట్టు చాలా వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేరళకు చెందిన ‘కర్మ న్యూస్’ అనే యూట్యూబ్‌ ఛానల్ 11 డిసెంబర్ 2021న జనరల్ బిపిన్ రావత్ మరణించినందుకు కోయంబత్తూరులోని కునియముత్తూరు ప్రాంతంలోని ఒక కాలేజీలోని ముస్లిం విద్యార్థులు డీజే పార్టీ ఏర్పాటు చేసి డాన్స్ చేసారని ఆరోపిస్తూ ఇదే వీడియోని రిపోర్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది.

ఐతే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కునియముత్తూరులోని నెహ్రు కాలేజీ యాజమాన్యం వీడియోకి సంబంధించి వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియోలోని దృశ్యాలు జనరల్ బిపిన్ రావత్ చనిపోయే ఒక రోజు ముందు, అనగా 07 డిసెంబర్ 2021 రోజున తమ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీకి సంబంధించినవని ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాతో తమ కాలేజీ మరియు విద్యార్థులకు సంబంధించి తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారని, మా కాలేజీ వ్యవస్థాపకుడు ఒక రిటైర్డ్ మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారని, అలాగే, మా కళాశాల ప్రొఫెసర్లు మరియు అధికారులలో 50 శాతానికి పైగా భారతీయ సైన్యం, వైమానిక దళం లేదా నౌకాదళంలో పనిచేసినవారేనని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన కాపీని న్యూస్ చెకర్ అనే ఫాక్ట్- చెకింగ్ సంస్థ షేర్ చేసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

ఇదే విషయమై కాలేజీ యాజమాన్యం యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీస్ కేసు రిజిస్టర్ చేసినట్టు హిందూ, IANS మొదలైన సంస్థలు (ఇక్కడ, మరియు ఇక్కడ) కథనాలని ప్రచురించాయి.

“ఇది పూర్తిగా తప్పుడు వార్త,  జనరల్ మరణాన్ని ఒక వర్గానికి చెందిన విద్యార్థులు సెలబ్రేట్ చేసుకున్నారంటూ అలాంటి వార్తలను ఎవరైనా ఎలా ప్రసారం చేయగలరు. ఇది మతపరమైన పోలరైజేషన్‌కు దారి తీస్తుంది. ఛానల్ ఆఫీస్ బేరర్లపై కఠినమైన చర్యలకు తీసుకుంటాం”, అని కోయంబత్తూరు పోలీసు సీనియర్ అధికారి ఒకరు IANSతో మాట్లాడుతూ అన్నట్టు పలు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

తమిళనాడు పోలీస్ ఈ కేసుకి సంబంధించి విచారణ మొదలుపెట్టి, సదరు యూట్యూబ్‌ ఛానల్‌కు సంబంధించిన సమాచారాన్ని కేరళ పోలీసులకు అందించిందని, త్వరలోనే తమిళనాడు పోలీస్ కేరళకు బయలుదేరనుందని ఒక వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రేపే వీడియోలు, పోస్టులు షేర్ చేస్తున్నారని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేసింది.

చివరగా, కాలేజీ ఫ్రెషర్స్ పార్టీకి సంబంధించిన వీడియోని జనరల్ బిపిన్ రావత్ మరణించినందుకు సంబరాలు చేసుకున్నారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll