Fake News, Telugu
 

ఈ వీడియోలో భారతమాత ఫోటోని లాగేసే ప్రయత్నం చేస్తున్న మహిళ ముస్లిం మతస్తురాలు కాదు

0

‘రిపబ్లిక్ డే’ రోజున జెండా వందనమే చేయకూడదని భారతమాత ఫోటోని ముంబైలో ఒక ముస్లిం మహిళ లాగేసే ప్రయత్నం చేయగా, అక్కడ ఉన్న ప్రజలు తనను అడ్డుకున్నారని, అలా అడ్డుకున్న వారిపై ఆ ముస్లిం మహిళ దాడి చేసినట్టు చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. “ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో కూడా లేనన్ని హక్కులు వీళ్ళు భారతదేశంలో అనుభవిస్తూ కూడా ఎందుకింత పగ ఈ దేశం మీద?”, అని కూడా పోస్ట్‌లో ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘రిపబ్లిక్ డే’ రోజున జెండా వందనమే చేయకూడదని భారతమాత ఫోటోని ముంబైలో ఒక ముస్లిం మహిళ లాగేసే ప్రయత్నం చేసి, అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని ఘటన ‘రిపబ్లిక్ డే’ రోజున మహారాష్ట్రలోని థానే ప్రాంతంలోని లోధా అమరా కాంప్లెక్స్‌లో జరిగింది. ఆ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. వీడియోలోని మహిళ ముస్లిం మతస్తురాలు కాదు, తను ఒక పంజాబీ హిందూ. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోపై వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. వీడియోలోని ఘటన ‘రిపబ్లిక్ డే’ రోజున ముంబై-థానే ప్రాంతంలోని లోధా అమరా కాంప్లెక్స్‌లో జరిగినట్టు తెలిసింది. ఆర్టికల్స్‌లో ఎక్కడా కూడా వీడియోలోని మహిళ ముస్లిం మతస్తురాలని కానీ, ఆ ఘటనలో మతపరమైన కోణం ఉందని కానీ రాసి లేదు.

వీడియోలోని మహిళ పేరు ‘కనిక భూపిందర్ సేఖ్రి’ అని, తను అలా ఎందుకు చేసిందో చెప్తూ పెట్టిన ట్వీట్ ఫోటోలను ‘మెన్స్ డే ఔట్’ అర్టికల్‌లో చదవచ్చు. అంతేకాదు, ఆ మహిళ పంజాబీ హిందూ అని, ముస్లిం మతస్తురాలు కాదని ‘చెక్‌పోస్ట్-మరాఠీ’ వారికి కపూర్‌బావడి పోలీసులు తెలిపినట్టు ఇక్కడ చదవచ్చు. ఆ మహిళపై ‘NC’ రిజిస్టర్ చేసినట్టు థానే సిటీ పోలీసు వారు ట్వీట్ చేసారు. ఆ మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని కొందరు తెలిపినట్టు కూడా కొన్ని వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి.

చివరగా, వీడియోలో భారతమాత ఫోటోని లాగేసే ప్రయత్నం చేస్తున్న మహిళ ముస్లిం మతస్తురాలు కాదు. ఆ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll