వివరణ (DECEMBER 3, 2021):
భారతదేశంలో మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో రిపోర్ట్ అయ్యాయి అని 02 December 2021న కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా ప్రతినిధులతో తెలిపారు.
‘కర్ణాటకలో 6000/ 400 కొత్త ఓమిక్రాన్ కరోనా కేసులు, రెండు నెలలు లాక్‌డౌన్ చేయాలి అంటున్న కర్ణాటక ప్రభుత్వం’ అంటూ ఒక కన్నడ న్యూస్ వీడియో రిపోర్ట్ షేర్ చేసిన పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో 6000/400 కొత్త ఒమిక్రాన్ కరోనా కేసులు, రెండు నెలలు లాక్ డౌన్ చేయాలి అంటున్న కర్ణాటక ప్రభుత్వం.
ఫాక్ట్ (నిజం): ప్రస్తుతానికి భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుండి కర్ణాటక వచ్చిన ఇద్దరికీ కోవిడ్ -19 పాజిటివ్ తేలింది, ఇందులో ఒకరి నమూనాలు డెల్టా వేరియంట్‌కి బిన్నంగా ఉండడంతో ఆ వ్యక్తి నమునాను కేంద్ర లాబరేటరీకి పంపినట్టు, కేంద్ర లాబరేటరీ నుండి ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు అది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్దారించాలేమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మీడియాకి వివరించారు. అలాగే కర్ణాటకలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలేదని ఆ రాష్ట ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే కొత్త కోవిడ్ -19 వేరియంట్ వెలుగులోకి వచ్చింది, ఇప్పటికే సుమారు 20కి పైగా దేశాలలో ఈ వేరియంట్ కేసులు కూడా నమోదైనట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర మొదలైన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రిస్క్ గల దేశాల మధ్య ప్రయాణాలు చేసేవారికి సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలనీ నిర్ణయించాయి.
ఐతే ప్రస్తుతానికి భారతదేశంలో ఈ వేరియంట్‌కి సంబంధించి ఎటువంటి కేసులు నమోదుకాలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా 30 నవంబర్ 2021న పార్లమెంటులో మాట్లాడుతూ కూడా ఇదే విషయం స్పష్టం చేసారు.
ఐతే ఇటీవల దక్షిణాఫ్రికా నుండి కర్ణాటక వచ్చిన ఇద్దరికీ కోవిడ్ -19 పాజిటివ్ తేలింది, ఇందులో ఒకరి నమూనాలు డెల్టా వేరియంట్‌కి బిన్నంగా ఉండడంతో ఆ వ్యక్తి నమునాను కేంద్ర లాబరేటరీకి పంపినట్టు, కేంద్ర లాబరేటరీ నుండి ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు అది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్దారించాలేమని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి మీడియాకి వివరించారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పలు మీడియా సంస్థలు కూడా ప్రభుత్వం లాక్‌డౌన్ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేసాయి, పోస్టులో షేర్ చేసిన వీడియో కూడా ఇలాంటిదే. ఐతే ఈ వీడియోలో కర్ణాటకలో 6000/400 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టుగాని లేక ప్రభుత్వం కచ్చితంగా లాక్‌డౌన్ విధించబోతుందని గానీ అనలేదు.
ఐతే లాక్‌డౌన్ వార్తలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన దేశాలనుండి ప్రయాణం చేసేవారికీ సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయబోతునట్టు అయన అన్నారు. ఈ వివరాల బట్టి పోస్టులో చెప్తునట్టు కర్ణాటకలో 6000/ 400 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయన్న వార్త నిజంకాదని స్పష్టమవుతుంది.
చివరగా, కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఇంకా ధ్రువీకరణ కాలేదు; అలాగే కర్ణాటకలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.