Fake News, Telugu
 

తమిళనాడు ఎడ్ల బండి పోటీలో జరిగిన ప్రమాదం దృశ్యాలని ఆంధ్రప్రదేశ్ మరియు టీడీపీకి ముడిపెడుతున్నారు

0

మహానాడు సభకు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎడ్ల బండ్లలో తరలివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఎడ్ల బండి వేగంగా దుసుకొస్తూ ద్విచక్ర వాహనాదారులని ఢీకొట్టిన దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఎడ్లకు పసుపు రంగు పూసినట్టు కనిపిస్తుంది. ఈ దుర్ఘటన జనసేన కార్యక్రమంలో జరిగి ఉంటే ప్రతిపక్ష, పాలక పక్ష పార్టీల అనుకూల మీడియా సంస్థలు డిబేట్ల మీద డిబేట్లు పెట్టేవని ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మహానాడు సభకు ఎడ్ల బండ్లలో తరలివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): తమిళనాడు సుందరేసపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఎడ్ల బండి పోటీలలో ఒక ఎడ్ల బండి ద్విచక్ర వాహనాదారులని ఢీకొట్టిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు సభకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొందరు సోషల్ మీడియా యూసర్లు తమ ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ ఛానల్స్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. తమిళనాడులో జరిగిన ఎడ్ల బండి పోటీలలో ఒక ఎడ్ల బండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన దృశ్యాలని ఈ సోషల్ మీడియా యూసర్లు వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోని ‘One Tamil News’ వార్తా సంస్థ తమ ఫేస్‌బుక్ పేజిలో షేర్ చేసింది. 15 మే 2022 నాడు సుందరేసపురం గ్రామంలో జరిగిన ఎడ్ల బండి పోటీలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు ‘One Tamil News’ తెలిపింది.

ఈ వివరాల ఆధారంగా వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, 15 మే 2022 నాడు సుందరేసపురం గ్రామంలో జరిగిన ఎడ్ల బండి పోటీల దృశ్యాలని చూపుతున్న పూర్తి వీడియో దొరికింది. ఈ పోటీలో పాల్గొన్న కొన్ని ఎడ్లకు పసుపు రంగు పూసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోలోని 1:50 నిమిషాల దగ్గర వేగంగా పరుగులు తీస్తున్న ఒక ఎడ్ల బండి ద్విచక్ర వాహనాదారులని ఢీకొట్టిన అవే దృశ్యాలని మనం చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో తమిళనాడులో నిర్వహించిన ఒక ఎద్దుల బండి పోటీకు సంబంధించిందని, తెలుగు దేశం పార్టీ  మహానాడు కార్యక్రమానికి సంబంధించినది కాదని చెప్పవచ్చు.

చివరగా, తమిళనాడుకు సంబంధించిన వీడియోని టీడీపీ కార్యకర్తలు మహానాడు సభకు ఎడ్ల బండ్లలో తరలివస్తుండగా జరిగిన ప్రమాదం దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll