Fake News, Telugu
 

‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి సగం కాలు తినేసిందని షేర్ చేస్తున్న ఈ మెసేజ్ ఫేక్

0

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి కాలు సగం తినేసిందని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే పోస్టుకు సంబంధించి రెండు వీడియోలు వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలకి సంబంధించి సమాచారం కోరుతూ కొందరు మా వాట్సాప్ టిప్ లైన్ నెంబర్ (+91 9247052470)కి పంపించారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి సగం కాలు తినేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు.

ఫాక్ట్: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి కాలు సగం తినేసిందని మాకు ఆధారాలు దొరకలేదు. వింత జంతువుగా ఆరోపించబడే ఈ యొక్క వీడియో జోసెఫ్-రాబ్ కోబాస్కీ అనబడే ఒక ఫ్రీలాన్స్ శిల్ప కళాకారుడు చేసింది. అది నిజమైన జంతువు కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

వింత జంతువుగా ఆరోపించబడే ఈ వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్ తో 27 నవంబర్ 2020న పబ్లిష్ అయిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లభించింది (ఇప్పుడు ఆ వీడియో లేదు, కానీ ఇంతకముందు జూన్ లో మేము రాసిన ఆర్టికల్‌లోని స్క్రీన్‌షాట్‌ కింద చూడొచ్చు). జోసెఫ్-రాబ్ కోబాస్కీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇది లభించింది. జోసెఫ్-రాబ్ కోబాస్కీ అనబడే ఒక ఫ్రీలాన్స్ శిల్ప కళాకారుడు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఇటువంటి ఫోటోలు షేర్ చేసాడు. ఆ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

లాస్ ఏంజిల్స్ కు చెందిన ట్రెములస్ మోషన్ పిక్చర్స్ అనే టెలివిజన్ మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో, ‘అన్ సాంక్టిఫైడ్’ పేరుతో చేస్తున్న ఒక చిత్రానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ రాబ్ కోబాస్కీ. ఆ స్టూడియో వారు ఇదే వీడియో అర్జెంటీనా, బ్రెజిల్ లో వైరల్ అయినప్పుడు ఆ జంతువు రాబ్ కోబాస్కీ తయారు చేసిందని, నిజమైనది కాదని ట్వీట్ చేసారు.

సాక్షి దినపత్రిక ఇదే క్లెయిమ్ కు సంబంధించి ఒక ఆర్టికల్ ప్రచురించింది. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ సమాచారంలో వాస్తవం లేదని స్థానిక సీఐ రవికుమార్ పేర్కొన్నట్టు తెలిపారు.

భారత్-పాకిస్తాన్ సియాల్ కోట్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం వేర్ వుల్ఫ్ ను ఢీకొట్టిన వీడియో అంటూ జూన్ 2021లో ఇదే వీడియో వైరల్ అయినప్పుడు FACTLY అది తప్పని చెప్తూ రాసిన ఆర్టికల్‌ ఇక్కడ చూడవొచ్చు. పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలా జరిగినట్టు సమాచారం గాని, ప్రముఖ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ గాని లభించలేదు.

చివరగా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి సగం కాలు తినేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll