Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి వస్తే అయోధ్య పేరు మారుస్తానని అఖిలేష్ యాదవ్ ప్రకటించలేదు

0

“మేము గెలిస్తే అయోధ్య పేరు మార్చి మొఘలుల పేరు పెడతాం”, అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. 2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య పేరు మార్చి మొఘలుల పేరు పెడతాం అని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

ఫాక్ట్ (నిజం): 2022 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య, ప్రయాగ్‌రాజ్ పేరులని మారుస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ‘Republic TV’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే అయోధ్య పేరు మారుస్తానని అఖిలేష్ యాదవ్ బహిరంగ ప్రకటన ఎక్కడైన చేసారా అని వెతికితే, సమాజ్‌వాదీ పార్టీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలలో గానీ, మరే మీడియా సమావేశంలో గానీ అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది.  ఒక వేళ అఖిలేష్ యాదవ్ నిజంగా అలాంటి ప్రకటన చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

అయితే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ‘Republic TV’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గెలిచి అధికారానికి వస్తే అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్ నగరాల పేర్లు మారుస్తానని ప్రజలకు వాగ్ధానం చేసాడు”, అని ఆరోపించారు. ఒవైసీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ ఒకే భాష వాడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అయోధ్య పేరు మారుస్తామని ప్రజలకు చెప్పారని యోగి ఆదిత్యనాథ్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలోని 2.38 నిమిషాల దగ్గర యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్ పై చేసిన ఈ ఆరోపణని పలు ఇతర వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. కానీ, అఖిలేష్ యాదవ్ తాను అధికారంలోకి వస్తే అయోధ్య పేరు మారుస్తానని ఉత్తరప్రదేశ్ ప్రజలకి వాగ్ధానం చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కేవలం యోగి అధిత్యనాథ్ చేసిన ఆరోపణ ఆధారంగా అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గెలిస్తే అయోధ్య పేరు మారుస్తానని వాగ్ధానం చేసినట్టు సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి వస్తే అయోధ్య పేరు మారుస్తానని అఖిలేష్ యాదవ్ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll