Coronavirus Telugu, Fake News, Telugu
 

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలని మూసివేస్తునట్టు 2020 కేసీఆర్ ప్రెస్ మీట్ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నారు

0

వివరణ (24 మార్చి 2021): రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను 24 మార్చి 2021 నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 23 మార్చి 2021 న శాసన సభలో ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు రేపటి నుండి 31 మర్చి 2021 వరకు మూసి వేస్తునట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకి తెలుపుతున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 31 మర్చి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసేస్తునట్టు కేసీఆర్ ప్రకటిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. ఈ వీడియో 14 మార్చి 2020 నాడు కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు సంబంధిచింది. కరోనా వైరస్ నియత్రణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లని 31 మార్చి 2020 వరకు మూసివేస్తునట్టు కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ లో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కోసం కీ పదాలతో గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Telangana CMO’ యూట్యూబ్ ఛానెల్లో 14 మార్చి 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో 14 మార్చి 2020 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో జరిపిన సమావేశానికి సంబంధించిందని తెలిసింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలని కేసీఆర్ ఈ సమావేశంలో మీడియాకి తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గూమిగుడే ప్రదేశాలని మూసివేస్తునట్టు కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇందులో భాగంగానే 15 మార్చి 2020 నుండి 31 మర్చి 2021 వరకు అన్ని విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసి చేస్తునట్టు కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ 14 మార్చి 2020 నాడు చేసిన ఈ ప్రకటనని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని, వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇటివల, తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల విద్యార్ధులు కోవిడ్-19 వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ విధించబోతునట్టు కొన్ని పుకార్లు చెలరేగుతున్నాయి.

చివరగా, కేసీఆర్ పాత ప్రెస్ మీట్ వీడియోని చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలని 31 మర్చి 2021 వరకు మూసివేస్తునట్టు కేసీఆర్ ఇటివల ప్రకటించిన వీడియో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll