Fake News, Telugu
 

ఈ వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది అల్లర్లను అదుపు చేయడానికి, రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు

0

రోడ్లపైన నమాజ్ చేస్తున్నందుకు పోలీసులు వారిని కొడుతున్నారని చెప్తూ, కొందరు ముస్లిం వ్యక్తులపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్న వీడియోలను షేర్ చేసిన పలు సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులలో ఒక వీడియోని మధ్యప్రదేశ్ పోలీసులకు ఆపాదించగా, ఇంకో వీడియోని ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఆపాదించారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రోడ్లపైన నమాజ్ చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు ముస్లింలను కొడుతున్న వీడియోలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో చెప్తున్నట్టు వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు. ఈ వీడియోలు, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, బర్వానీ ప్రాంతాల్లో మిలాద్ అన్ నబీ సంధర్బంగా జరిగిన ఊరేగింపులలో అల్లర్లు జరగడంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటిని అదుపు చేసిన ఘటనలకు సంబంధించినవి. ఈ ఘటనలను అన్ని ప్రముఖ వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. పైగా ఈ మధ్య కాలంలో రోడ్డుపై నమాజ్ చేస్తునందుకు పోలీసులు కొట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియో 1:

ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం వెతికే క్రమంలో మాకు ‘DNN News’ అనే ఒక లోకల్ వార్తా సంస్థ యొక్క రిపోర్ట్‌లో వైరల్ వీడియోలోని లొకేషన్ మ్యాచ్ అయిన వీడియో ఒకటి కనిపించింది. ఈ న్యూస్ రిపోర్ట్‌ వీడియోని 19 అక్టోబర్ 2021న ఫేస్‌బుక్‌ పేజీలో అప్లోడ్ చేసారు. న్యూస్ వీడియోలోని కొన్ని దృశ్యాలను వైరల్ వైరల్ వీడియోలోని దృశ్యాలతో పోల్చినప్పుడు ఈ రెండు ఒకే ప్రదేశంలో షూట్ చేసినట్టు అర్ధమవుతుంది.

వీడియోకి సంబంధించి ఉన్న సమాచారం ప్రకారం వీడియోలో కనిపిస్తున్నది మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని ఫిష్ మార్కెట్ ప్రాంతం. కొందరు ఆందోళనకారులు రాళ్ళు విసరడంతో పోలీసులు వారిపై టీయర్ గ్యాస్ ప్రయోగించినట్టు ఈ పోస్టులో పేర్కొన్నారు. అలాగే న్యూస్ వీడియోలో ‘एस दीन टेलर्स’ (S Deen Tailors) పేరుతో ఒక షాప్ స్పష్టంగా కనిపిస్తుంది, ఇదే షాపు వైరల్ వీడియోలో కూడా చూడొచ్చు. ఐతే న్యూస్ వీడియోలోని సమాచారం ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో వెతకినప్పుడు ఈ షాపు జబల్‌పూర్‌లో ఉన్నట్టు తెలిసింది.

ఇదే క్రమంలో పైన తెలిపిన వివరాల ఆదారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలను వేరే ఆంగిల్‌లో షూట్ చేసిన, ఎక్కువ నిడివిగల వీడియోలు పలు ఫేస్‌బుక్‌ పోస్టులలో (ఇక్కడ మరియు ఇక్కడ) మాకు కనిపించాయి. ఈ పోస్టులలో చెప్తున్న దాని ప్రకారం ఈ వీడియో ఇటీవల మిలాద్ అన్ నబీ సంధర్బంగా జబల్‌పూర్‌లో ముస్లింలు జరిపిన ఊరేగింపులో ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసారు.

ఈ ఘటనలకి సంబంధించిన వార్తా కథనాల కోసం వెతకగా,  పైన తెలిపిన ఫేస్‌బుక్‌ వీడియోలలోని దృశ్యాలను పోలిన ఫోటోలను ప్రచురించిన వార్తా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ కథనం కూడా ఈ వీడియో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిందేనని నిర్దారిస్తుంది. జబల్‌పూర్‌లో మిలాద్ అన్ నబీ సంధర్బంగా జరిగిన ఊరేగింపులో కొందరు పోలీసులపైకి టపాకాయలు విసరడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసారని ఈ కథనంలో పేర్కొన్నారు.

అలాగే ఈ మధ్య కాలంలో రోడ్డుపై నమాజ్ చేస్తునందుకు పోలీసులు కొట్టిన ఘటనలు ఉత్తరప్రదేశ్‌లోగాని లేక ఇతర ప్రాంతాల్లో జరిగినట్టు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి ఈ వైరల్ వీడియోకి ఉత్తరప్రదేశ్‌కి లేదా రోడ్డుపై నమాజ్ చేయడానికి ఎటువంటి సంబంధంలేదు.

వీడియో 2:

ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం వెతికే క్రమంలో ఇదే వీడియో యొక్క ఎక్కువ నిడివిగల వెర్షన్‌ని షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్‌ పోస్టు మాకు కనిపించింది, ఈ పోస్టులో వీడియోలోని ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగినట్టు పేర్కొన్నారు. ఐతే ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వీడియోలో పోలీసులు కొడుతుంటే కొందరు వ్యక్తులు  ‘भारत मशीनरी स्टोर’ (భారత్ మెషినరీ స్టోర్) పేరుతో ఉన్న ఒక షాప్‌లోకి వెళ్ళడం చూడొచ్చు.

గూగుల్ మ్యాప్స్‌లో వెతకగా ఈ షాప్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బర్వానీ జిల్లాలోని రాజ్‌పూర్ పట్టణంలో ఉన్నట్టు తెలిసింది. దీన్నిబట్టి ఈ ఘటన రాజ్‌పూర్‌లో జరిగినట్టు నిర్దారించుకోవచ్చు.

పైన తెలిపిన వివరాల ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఇటీవల 19 అక్టోబర్ రోజున రాజ్‌పూర్‌లో జరిగిన పోలీస్ లాఠీచార్జ్ ఘటనని రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం 19 అక్టోబర్ రోజున  మిలాద్ అన్ నబీ సందర్భంగా ఒక వర్గం ఊరేగింపు నిర్వహించగా, ఈ ఊరేగింపు డిజెలో ఒక వివాదాస్పద పాటను ప్లే చేయడంతో రెండు వర్గాలు రాళ్ళ దాడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేసాయి. ఈ రాళ్ళ దాడిలో  పోలీసులతో పాటు రెండు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. ఐతే పోలీసులు చెప్తున్నదాని ప్రకారం ఈ ఊరేగింపుకి పోలీసుల అనుమతి లేదు.

లోకల్ వార్తా సంస్థలు ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను వీడియో రిపోర్ట్ చేసాయి. అలాంటి ఒక వీడియో రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ న్యూస్ వీడియోని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వీడియోలో ఆందోళనకారులు ‘Sara Computers’ పేరుతో ఉన్న ఒక షాప్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూడొచ్చు.

గూగుల్ మ్యాప్స్‌లో ఈ షాప్ కోసం వేతకగా, ఇది పైన పేర్కొన్న ‘भारत मशीनरी स्टोर’ షాప్‌ సమీపంలోనే ఉన్నట్టు తెలిసింది.

పైగా పైన తెలిపిన వీడియో రిపోర్ట్ లో भारत मशीनरी स्टोर’, ‘Sara Computers’ షాపుల మధ్య ఉన్న ఫ్లెక్సీ మరియు కర్టెన్ గమనించొచ్చు. ఇదే ఫ్లెక్సీ మరియు కర్టెన్‌ని వైరల్ వీడియో యొక్క ఎక్కువ నిడివిగల వెర్షన్‌లో కూడా చూడొచ్చు. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వీడియో ఈ ఘటనకు సంబంధించిందేనని అర్ధంచేసుకోవచ్చు. పైగా రాజపూర్‌లో రోడ్డుపై నమాజ్ చేసినందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు.

బర్వానీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వీడియో రిపోర్ట్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే  ఇటీవల మధ్యప్రదేశ్‌లోని దార్, జబల్‌పూర్‌, బర్వానీ ప్రాంతాలలో మిలాద్ అన్ నబీ సందర్భంగా అల్లర్లు జరగగా, పోలీసులు లాఠీచార్జ్ జరిపినట్టు అనేక వార్తా సంస్థలు కథనాలు పబ్లిష్ చేసాయి. ఐతే రోడ్డుపై నమాజ్ చేసినందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు మాత్రం ఈ కథనాలలో రిపోర్ట్ చేయలేదు.

చివరగా, ఈ వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది అల్లర్లను అదుపు చేయడానికి, రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll