Fake News, Telugu
 

ఈ ఫోటో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు 2016లో కరెంట్ స్తంభం ఎక్కినప్పటిది

0

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఫిర్యాదు అందుకున్న వెంటనే స్వయంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించాడని చెప్తూ చన్నీ ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కుతున్న ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఫిర్యాదు అందుకున్న వెంటనే స్వయంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటి ఫోటో.

ఫాక్ట్ (నిజం): చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులో చెప్తున్నట్టు కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు ఎటువంటి సమాచారమైతే లేదు. ఇకపోతే ఈ ఫోటో 2016లో సిహోన్ మజ్రా గ్రామంలో పెండింగ్ కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో, చన్నీ స్వయంగా కరెంట్ స్తంభాన్ని ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన సంధర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులో చెప్తున్నట్టు కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు ఎటువంటి సమాచారమైతే లేదు. ఒకవేళ ఇలా జరిగి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఇలాంటి వార్తా కథనాలేవి మాకు లభించలేదు.

ఐతే పోస్టులో షేర్ చేసిన ఫోటో చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు 2016లో తీసింది. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన కొన్ని 2016 వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ‘2016లో పంజాబ్‌లోని సిహోన్ మజ్రా గ్రామంలో రూ. 9.8 లక్షల పెండింగ్‌ బిల్లును చెల్లించకపోవడంతో అధికారులు కరెంటు సరఫరాని నిలిపివేశారు. ఐతే ఈ విషయం చన్నీ దృష్టికి రావడంతో తను స్వయంగా విద్యుత్ స్తంభాన్ని ఎక్కి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించారు.’ ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఇటీవల 18 అక్టోబర్ 2021న రెండు కిలోవాట్ల వరకు విద్యుత్ కనెక్షన్ ఉన్నవారికి పెండింగ్ విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తూ, దీనికి ప్రతీకగా విద్యుత్ బిల్లుల కాపీలను తాను స్వయంగా కాల్చేస్తున్న వీడియోని చన్నీ ట్విట్టర్‌లో షేర్ చేసారు.

చివరగా, చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించాడని షేర్ చేస్తున్న ఈ ఫోటో తను పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు 2016లో కరెంట్ స్తంభం ఎక్కినప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll