Fake News, Telugu
 

కర్ణాటక రోడ్డు విస్తరణలో భాగంగా కుల్చివేసిన మసీదు నుండి హిందూ దేవాలయం బయటపడలేదు

0

కర్ణాటకలో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక మసీదును కుల్చివేస్తుండగా, అందులో నుండి శివాలయం బయటపడిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ శివాలయాన్ని టిప్పు సుల్తాన్ కాలంలో మసీదుగా మార్చారని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక మసీదును కుల్చివేస్తుండగా అందులో నుండి శివాలయం బయటపడింది.

ఫాక్ట్ (నిజం): 2016లో రాయచూరు జిల్లా అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రాయచూరులోని ఏక్ మినార్ మసీదులోని కొంత భాగాన్ని కుల్చివేసారు. ఏక్ మినార్ మసీదు కూల్చివేత తరువాత బయటపడిన స్తంబాలు, హిందూ దేవాలయాలలో నిర్మించే స్తంభాలతో పోలి ఉన్నాయని అక్కడి హిందూ సంఘాలు ఆరోపించారు. కాని, ఏక్ మినార్ మసీదుపై చేస్తున్న ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అప్పటి రాయచూరు జిల్లా మేజిస్ట్రేట్ స్పష్టం చేసారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈ ఫోటో కనీసం 2016 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ పాత పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. ఒక యూసర్ తన ట్విట్‌లో, ‘రాయచూరు ఏక్ మినార్ మసీదుని కుల్చివేస్తుండగా, అందులో నుండి హిందూ బ్రాహ్మణులూ చెక్కిన అధ్బుత శిల్ప కట్టడాలు బయటపడ్డ దృశ్యాలు’, అని తెలిపారు. ‘Trip Advisor’ వెబ్సైటులో ఈ ట్వీట్లలో షేర్ చేసిన మసీదు ఫోటోని పబ్లిష్ చేసారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది రాయచురులోని ఏక్ మినార్ మసీదని ‘Trip Advisor’ వెబ్సైటులో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ ఘటనకు సంబంధించి ‘Deccan Chronicle’ న్యూస్ సంస్థ 15 ఏప్రిల్ 2016 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2016లో రోడ్డు విస్తరణలో భాగంగా రాయచూరులోని ఏక్ మినార్ మసీదులోని కొంత భాగాన్ని కుల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఏక్ మినార్ మసీదు కూల్చివేత తరువాత బయటపడిన స్తంబాలు, హిందూ దేవాలయాలలో నిర్మించే అధ్బుత శిల్పస్తంబాలతో పోలి ఉన్నాయని అక్కడి హిందూ సంఘాలు ఆరోపించినట్టు తెలిసింది. ఏక్ మినార్ మసీదు చరిత్రపై వెంటనే విచారణ జరిపి ఆ స్థలంలో ముందుగా దేవాలయం నిర్మించబడిందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని రాయచూరు హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. కాని, ఏక్ మినార్ మసీదులో బయటపడిన స్థంబాలు, హిందూ దేవాలయానికి సంబంధించినవే అని ఈ ఆర్టికల్‌లో ఎక్కడ నిర్ధారించలేదు. రాయచూరు రోడ్డు విస్తరణ కుల్చివేతలకు సంబంధించి ‘The Hindu’ న్యూస్ సంస్థ 10 ఏప్రిల్ 2016 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

సోషల్ మీడియాలో ఏక్ మినార్ మసీదుకి సంబంధించి షేర్ చేస్తున్న వార్తలపై స్పష్టత కోసం ‘Alt News’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ అప్పటి రాయచూర్ జిల్లా మేజిస్ట్రేట్‌ని సంప్రదించారు.  రాయచూర్ జిల్లా మేజిస్ట్రేట్‌ ‘Alt News’తో మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ సమాచారం పూర్తిగా తప్పు. రాయచూర్ రోడ్డు విస్తరణలో భాగంగా పురాతనమైన ఏక్ మినార్ మసీదుతో పాటు కొన్ని మతపరమైన కట్టడాలు కుల్చివేయడం జరిగింది. ఇలాంటి పురాతనమైన కట్టడాలలో అనేక రకాలైన కట్టడాలు ఉన్నాయి. కేవలం, ఒక స్తంబం శిల్ప కట్టడాన్ని బట్టి అది హిందూ దేవాలయాని నిర్దారించలేము. కొన్ని గ్రూపులు ఈ ఆరోపణ చేయడానికి ప్రయత్నించారు. కాని, వారి ఆరోపణల గురుంచి తిరిగి అడిగినప్పుడు, వారు తమ ఆరోపణలని కొనసాగించలేదు”, అని తెలిపారు.  ఈ వివరాల ఆధారంగా, 2016లో రాయచూరు ఏక్ మినార్ మసీదు కుల్చివేసినప్పుడు హిందూ దేవాయలం బయటపడిందని చేస్తున్న క్లెయిమ్ పూర్తిగా నిరాధారమైనదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కర్ణాటక రోడ్డు విస్తరణలో భాగంగా కుల్చివేసిన మసీదు నుండి హిందూ దేవాలయం బయటపడలేదు.

Share.

About Author

Comments are closed.

scroll