Fake News, Telugu
 

వరద నీటితో నిండిపోయిన ఇంట్లోకి చేపలు కొట్టుకువచ్చిన పాత దృశ్యాలని తిరుపతి వరదలకు ముడి పెడుతున్నారు

0

తిరుపతి వరదల కారణంగా అక్కడ ఉన్న ఇళ్లలోకి చేపలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తిరుపతి నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం వరదలతో నిండిపోయిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుపతి వరదల కారణంగా అక్కడ ఉన్న ఇళ్లలోకి చేపలు కొట్టుకు వచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. ఈ వీడియో కనీసం 2020 నవంబర్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియో తిరుపతి వరదలకి సంబంధించినది కాదని స్పష్టమయ్యింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కనీసం 2020 నవంబర్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోని సిద్ రజాలి అనే వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో వివరణలో తెలిపింది.

ఈ వివరాల ఆధారంగా వీడియో కోసం సిద్ రజాలి ట్విట్టర్ హ్యాండిల్‌లో వెతకగా, ఈ వీడియోని సిద్ రజాలి 24 నవంబర్ 2020 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఇంట్లో చేరిన వరద నీటిలో చేపలు కొట్టుకు వచ్చిన దృశ్యాలని సిద్ రజాలి తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, తన ఇల్లు వరద నీటితో మునిగిపోయిన మరొక వీడియోని కూడా సిద్ రజాలి ట్వీట్ చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియోని సిద్ రజాలి తీసినట్టు పలు వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. మలేషియా తెరగ్గన్ను రాష్ట్రంలోని ఒక ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. అయితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 20 నవంబర్ 2020 నాడు అంటే, సిద్ రజాలి ఈ వీడియోని ట్వీట్ చేయక ముందే కొందరు యూసర్లు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఎక్కడిదని స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియో పాతదని, తిరుపతి వరదలకి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు అక్కడి లోత్తట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగినట్టు పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఈ వరద భీభత్సంతో తిరుపతి నగరంలోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరినట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు. అలాగే, తిరుపతి వరద ప్రవాహంలో చేపలను కొట్టుకు వస్తున్నాయని మరికొన్ని న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేసాయి. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో తిరుపతి వరదలకి సంబంధించినది కాదు.

చివరగా, వరద నీటితో నిండిపోయిన ఇంట్లోకి చేపలు కొట్టుకువచ్చిన పాత దృశ్యాలని తిరుపతి వరదలకు ముడి పెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll