ఇటీవల కేరళలోని పాలక్కాడ్‌లో సంజిత్ అనే ఒక RSS కార్యకర్తని కొందరు వ్యక్తులు నరికి చంపిన ఘటనను వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ నేపథ్యంలోనే ‘RSS కార్యకర్తను మసీద్‌లోకి తీసుకెళ్లి తల నరికిన కేరళ ముస్లింలు’ అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియా విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ వీడియోకి సంబంధించి వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) చాలా అభ్యర్ధనలు కూడా వచ్చాయి. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కేరళలో ముస్లింలు, RSS కార్యకర్తను మసీదులోకి తీసుకెళ్లి తల నరికిన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కొందరు ముస్లిం వ్యక్తులు ఒకతనిని లాకెళ్తున్న దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని సిక్రీలో అనుజ్ అనే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు లైన్‌మెన్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఇక ఒక వ్యక్తిని కట్టేసి నరికే దృశ్యాలు 2018లో వెనిజులా దేశంలో మేగాబండాస్ అనే క్రిమినల్ గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో ఒక గ్యాంగ్, ప్రత్యర్థి గ్యాంగ్‌కి చెందిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి గొంతు కోసి చంపేసిన ఘటనకు సంబంధించినవి. పైగా ఇటీవల కేరళలో ముస్లింలు RSS కార్యకర్తను మసీద్‌లోకి లాకెళ్ళి నరికి చంపిన ఘటనేది కూడా జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న వీడియో రెండు వీడియోలను డిజిటల్‌గా అతికించినట్టు, ఈ రెండు వీడియోల గురించిన వివరణను విడిగా కింద చూద్దాం.
వీడియో 1:
కొందరు ముస్లిం వ్యక్తులు ఒక వ్యక్తిని లాక్కొని వెతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మే 2021లో జరిగిన ఒక ఘటనకి సంబంధించింది. ఈ ఘటనని పలు లోకల్ హిందీ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి, ఈ రిపోర్ట్స్ ప్రకారం వీడియోలో దెబ్బలు తిన్న వ్యక్తి పేరు అనుజ్, అతను ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అనుజ్ పని మీద సిక్రీకి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి చెందిన సల్మాన్, అతని సోదరుడు తమ కేబుల్ మార్చమని అనుజ్‌ని కోరగా అతను నిరాకరించడంతో గొడవ మొదలైంది, ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన పలువురు అనుజ్‌పై దాడి చేసారు.
ఈ ఘటను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇదే వీడియో ఒక వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా, ఈ ట్వీట్‌కి ముజఫర్‌నగర్ పోలీస్ స్పందిస్తూ ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
వీడియో 2:
ఇక ఒక వ్యక్తిని తాళ్ళతో కట్టేసి, నరికిన వీడియో వెనిజులా దేశంలో జరిగిన ఘటనకి సంబంధించింది. వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2018లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వెనిజులాలో మేగాబండాస్ అనే క్రిమినల్ గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో ఒక గ్యాంగ్ ప్రత్యర్థి గ్యాంగ్‌కి చెందిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, తెలియని ప్రదేశంలో గొంతు కోసి చంపేశారు. వైరల్ వీడియో ఈ ఘటనకి సంబంధించిందే.
ఈ ఘటనని 2018లో రెండు క్రిమినల్ గ్యాంగ్స్ మధ్య జరిగిన ఘటనగా రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఈ ఆర్టికల్ మొదట్లో తెలిపిన ఘటన మినహాయిస్తే, ఇటీవల కేరళలో ముస్లింలు RSS కార్యకర్తను మసీదులోకి లాకెళ్ళి నరికి చంపిన ఘటనేది జరగలేదు, ఒకవేళ ఇలాంటి ఘటన నిజంగా జరిగి ఉంటే, వార్తా సంస్థలు దీనిని రిపోర్ట్ చేసి ఉండేది, కాకపోతే మాకు కేరళలో ఇలాంటి ఘటన జరిగినట్టు ఆధారాలు లభించలేదు.
చివరగా, సంబంధంలేని పాత వీడియోలను కేరళలో ముస్లింలు RSS కార్యకర్తను మసీదులోకి తీసుకెళ్లి తల నరికి చంపారంటూ షేర్ చేస్తున్నారు.