Fake News, Telugu
 

కేరళ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్‌ల కోసం భారీగా ఖర్చు చేస్తుందని షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు

0

పినరయి విజయన్ నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని మదర్సా ఉపాధ్యాయులకు జీతాలు, ఇతర ప్రయోజనాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోంది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. కేరళ ప్రభుత్వం ప్రతి మదర్సా ఉపాధ్యాయుడికి 25,000 జీతం, రిటైర్ అయిన వ్యక్తికి ప్రతీ నెల 6,000 పెన్షన్ ఇస్తుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. కేరళలోని ముస్లిం జనాభా, మదర్సాల సంఖ్య, కేరళలోని గ్రామపంచాయితిలలో సగటు మదర్సాల సంఖ్య, మదర్సాల ఉపాధ్యాయుల సంఖ్య, వారి నెల జీతాల తదితర వివరాలను ఈ పోస్టులో తెలిపారు. ఈ పోస్టులో తెలుపుతున్న వివరాలలో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కేరళ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయులకు జీతాలు, ఇతర ప్రయోజనాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోంది.

ఫాక్ట్ (నిజం): కేరళ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయుల జీతాల కోసం లేదా మరే ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానా నుండి డబ్బులు చెల్లించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేసారు . 2019లో కేరళ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయుల కోసం ‘ది కేరళ మదరసా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్, 2019’ బిల్లుని ఆమోదించింది. ఈ వెల్ఫేర్ ఫండ్ ద్వార 60 సంవత్సరాలు పైబడిన మదరసా టీచర్లకు నెలకు 1,500 నుండి 7,500  వరకు పెన్షన్ ఇస్తున్నారు. కాని, ఈ వెల్ఫేర్ ఫండ్‌కు కావలిసిన డబ్బులు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. ఈ వెల్ఫేర్ ఫండులో రిజిస్టర్ అయిన మదర్సా ఉపాధ్యాయులు, ముస్లిములు ప్రతి నెల 50 రూపాయులు ఈ వెల్ఫేర్ ఫండుకు స్వచ్చందంగా విరాళాలు అందించాలి. అలా వచ్చిన డబ్బులతోనే ఈ వెల్ఫేర్ ఫండ్‌ని నడిపిస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింలకు సంబంధిచిన వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

కేరళ జనాభా, అందులో ముస్లిం జనాభా ఎంత:

2011 సెన్సస్ వివరాల ప్రకారం కేరళ జనాభా 3,34,06,061 కోట్లు, పోస్టులో తెలుపుతున్నట్టు 3,56,99,443 జనాభా కాదని తెలిసింది. కేరళలో ముస్లిం జనాభా మాత్రం పోస్టులో తెలుపుతున్నట్టు 88,73,442 అనే తెలిసింది. అంటే, మొత్తం కేరళ రాష్ట్ర జనాభాలో 26.56 శాతం మంది ముస్లింలు ఉన్నట్టు.

కేరళలో మదర్సాల సంఖ్య, అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య:

2019లో కేరళ పభుత్వం ‘ది కేరళ మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్, 2019’ అనే బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో అప్పటి కేరళ మైనారిటీ వెల్ఫేర్ మంత్రి KT జలీల్, కేరళ రాష్ట్రంలో మొత్తంగా 21,683 మదరసాలు ఉన్నాయని, అందులో మొత్తంగా 2,04,683 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. KT జలీల్ ఈ వివరాల్ని కేరళ అసెంబ్లీలో తెలుపుతున్న దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. అలాగే, మదర్సా ఉపాధ్యుయులకు 6,000కు మించి జీతం ఉండదని KT జలీల్ కేరళ అసెంబ్లీలో పేర్కొన్నారు.

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మదర్సాల సంఖ్య, మదర్సా ఉపాధ్యాయుల వివరాల కోసం ‘The Quint’ వార్తా సంస్థ ఇటీవల కేరళ మదర్సా వెల్ఫేర్ బోర్డు సీఈఓ హమీద్‌ను సంప్రదించారు. హమీద్‌  ‘The Quint’ వారికి కేరళలో ప్రస్తుతం 27,814 మదర్సాలు ఉన్నాయని, అందులో 1,70,816 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని స్పష్టం చేసారు.

కేరళ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయితీలు అలాగే, పంచాయితీలలో సగటు మదర్సాల సంఖ్య:

పోస్టులో తెలుపుతున్నట్టు కేరళ రాష్ట్రంలో మొత్తంగా 941 గ్రామ పంచాయితీలున్నట్టు కేరళ వెబ్సైటులో కూడా తెలిపారు. పంచాయితీలలో సగటు మదర్సాల సంఖ్య 29.55 అంటే, పోస్టులో తెలిపిన సంఖ్య (23) కన్నా ఎక్కువగానే ఉన్నట్టు స్పష్టమయ్యింది.

మదర్సా ఉపాధ్యాయుల జీతం:

ఈ పోస్టులో కేరళ ప్రభుత్వం మదర్సాల ఉపాధ్యాయులకు నెలకు 25,000 జీతం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కేరళ ప్రభుత్వం ‘డైరెక్టరేట్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్’ వెబ్సైటులో వెతికితే, కాంపిటీటివ్ పరిక్షల కోసం ముస్లిం యువకులకు ఉచితంగా శిక్షణ అందించడానికి కేరళ ప్రభుత్వం 16 ఉచిత కోచింగ్ సెంటర్లని ఏర్పాటు చేసిందని, ఆ కోచింగ్ సెంటర్లలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి మాత్రమే నెలకు 25,000 జీతాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తునట్టు తెలిసింది. ఈ కోచింగ్ సెంటర్లకు శిక్షణ అందించే ఉపాధ్యాయులకి కేరళ ప్రభుత్వం గంటకి 300 రూపాయిల వేతనాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. మదర్సాల ఉపాధ్యాయుల వేతనాలకు సంబంధించిన వివరాలని ఈ వెబ్సైటులో ఎక్కడా తెలుపలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారానికి సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2021 జూలై నెలలో స్పష్టతనిచ్చారు. మదర్సా ఉపాధ్యాయుల వేతనాలని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదని ఆయన స్పష్టం చేసారు. మదర్సా టీచర్ల వేతనాలని సంబంధిత మదర్సాల కమ్యూనిటీలు వారి ఆర్ధిక స్తోమత బట్టి చెల్లించుకుంటాయని KT జలీల్ ఆఫీస్ వారు ఫాక్ట్ క్రేసేండో ఫాక్ట్-చెకింగ్ సంస్థతో తెలిపారు. కేరళ మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ కోసం కార్పస్ ఫండ్ మాత్రమే ఇచ్చినట్టు పినరయి విజయన్ అసెంబ్లీలో స్పష్టం చేసారు. RSSకు చెందిన కొందరు సోషల్ మీడియా యూసర్లు కేరళ ప్రభుత్వం ముస్లింల కోసం భారీ ప్రయోజనాలు కల్పిస్తున్నాయని తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు.

మదరసా ఉపాధ్యాయుల పెన్షన్:

కేరళ ప్రభుత్వం ఆమోదించిన కేరళ మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ద్వార మదర్సా రిటైర్డ్ టీచర్లకు 1,500 నుండి అత్యధికంగా 7,500 రూపాయిల దాక పెన్షన్ ఇస్తున్నట్టు తెలిసింది. 2010లో మొదలైన ఈ సంక్షేమ పథకంలో సభ్యుడిగా చేరిన ప్రతి ఒక్క మదర్సాల టీచర్ ఈ పెన్షన్ లాభాలు పొందవచ్చని తెలిపారు. కాని, ఈ వెల్ఫేర్ ఫండ్‌కు కావలిసిన డబ్బులు కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. కేవలం, ఈ సంక్షేమ పథకం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కార్పస్ ఫండ్ జమ చేసినట్టు తెలిసింది. ఈ పథకానికి కావలిసిన బ్యాంక్ రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ సంక్షేమ పథకం ద్వార మదర్సా ఉపాధ్యాయులకు తాము పెన్షన్ చెల్లిస్తున్నట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు, సంబంధింత బిల్లులో కూడా ప్రభుత్వం చెల్లిస్తునట్టు లేదు.

ఈ సంక్షేమ పథకంలో రిజిస్టర్ అయిన మదర్సా ఉపాధ్యాయులు, ముస్లిం కమ్యూనిటీలు వెల్ఫేర్ ఫండుకు ప్రతి నెల 50 రూపాయులు స్వచ్చందంగా విరాళంగా ఇవ్వాలని రూల్ పెట్టారు. అలా వచ్చిన డబ్బులతోనే ఈ సంక్షేమ పథకం అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేరళ మదరసా టీచర్స్ వెల్ఫేర్ ఫండులో 23,809 మదరసా ఉపాధ్యాయులు చేరినట్టు ‘The Hindu’ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో తెలుపుతున్నట్టు మదర్సా ఉపాధ్యాయుల పెన్షన్‌ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని స్పష్టమయ్యింది.

మదరసా ఉపాధ్యాయులకు నెలసరి,  సంవత్సరానికి అందిస్తున్న జీతం మరియు పెన్షన్ వివరాలు:

పోస్టులో తెలిపినట్టు కేరళ ప్రభుత్వం మదర్సా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని పై వివరాల ఆధారంగా స్పష్టమయ్యింది. కేరళ ప్రభుత్వం మదరసా ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్ చెల్లించడం కోసం 7,580 కోట్లు చెల్లిస్తుందని చేస్తున్న క్లెయిమ్ పూర్తిగా తప్పని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని మదర్సా ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్‌ల కోసం భారీగా ఖర్చు చేస్తుందని షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు.

Share.

Comments are closed.

scroll