Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్‌లో వరదనీటిలో బస్సు కొట్టుకుపోతున్న పాత వీడియోను ఇటీవల కడపలో జరిగిందిగా షేర్ చేస్తున్నారు

0

వరదనీటిలో ఒక బస్సు, దానిపై ఉన్న జనాలు కొట్టుకుపోతున్న వీడియోను ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తూ, అది కడప జిల్లాలోని నందలూరు ప్రాంతానికి సంబంధించినదిగా చెప్తున్నారు. దాదాపు 50 మంది వరద నీటిలో కొట్టుకుపోయారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల కడప జిల్లాలోని నందలూరులో వరదనీటిలో ఒక బస్సు, దానిపై ఉన్న జనాలు కొట్టుకుపోతున్న ఘటన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోలో జరిగిన సంఘటన బెంగాల్‌లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2012లో భైరాబంకి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా ఒక ప్రైవేట్ బస్సు కొట్టుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు; కనీసం ముగ్గురు తప్పిపోయారు. కడప జిల్లాలోని నందలూరులో బస్సులు వరదనీటిలో చిక్కుకుపోయి, చాలా మంది మరణించినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ, ఈ వీడియో మాత్రం కడపకు సంబంధించినది కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. యూట్యూబ్‌ వీడియోను 06 సెప్టెంబర్ 2014న అప్లోడ్ చేసినట్టు చూడొచ్చు. అంటే, ఇది ఒక పాత వీడియో, ఇటీవల తీసింది కాదు. యూట్యూబ్‌ వీడియో టైటిల్‌లో మరియు వివరణలో, ఈ ఘటన 2012 పశ్చిమ బెంగాల్ లో జరిగినట్టు తెలిపారు. 0.32 టైం ఫ్రేమ్ దగ్గర నుండి యూట్యూబ్‌ వీడియోను క్లిప్ చేసి, 41 సెకండ్ల నిడివిగల ఈ పోస్టులోని వీడియోను చేసారు.    

వీడియో పశ్చిమ బెంగాల్ కు సంబంధించి అయ్యుంటుందనే క్లూ తీసుకొని గూగుల్లో వెతకగా, అదే సంఘటనకు సంబంధించి ఆర్టికల్స్, వీడియోలు లభించాయి. బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భైరాబంకి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా ఒక ప్రైవేట్ బస్సు కొట్టుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు; కనీసం ముగ్గురు తప్పిపోయినట్టు ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇతర వీడియో రిపోర్ట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ), అదే విజువల్స్‌తో ఘటనను రిపోర్ట్ చేసాయి.

ఇదే క్లెయిమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫాక్ట్ చెక్ వింగ్ ఇది ఫేక్ అని తెలిపారు. ఏపీ ఫాక్ట్ చెక్ వింగ్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది తొమ్మిది ఏండ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన అంటూ వీడియో యొక్క ఒరిజినల్ లింక్ పోస్ట్ చేసారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు కురవటంతో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం జరిగింది. కనీసం 12 మంది చనిపోయుంటారని, చాలా మంది తప్పిపోయినట్టు ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. కడప జిల్లాలోని నందలూరులో బస్సులు వరదనీటిలో చిక్కుకుపోయి, చాలా మంది చనిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ, వైరల్ వీడియో మాత్రం కడపకు సంబంధించినది కాదు.

చివరగా, పశ్చిమ బెంగాల్‌లో వరదనీటిలో బస్సు కొట్టుకుపోతున్న పాత వీడియోను ఇటీవల కడపలో జరిగిందిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll