Fake News, Telugu
 

ఒమిక్రాన్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు బంద్ అని వస్తున్న వార్తల్లో నిజంలేదు

0

దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు ముసేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఆ వార్తకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు ముసేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

ఫాక్ట్ (నిజం): ఇటీవల 30 నవంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం అనంతరం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని, సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) శ్రీ దేవసేన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల 30 నవంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఐతే ఈ సమావేశంలో విద్యాసంస్థలు ముసేయాలన్న నిర్ణయం ఏదీ తీసుకోలేదు. విద్యాసంస్థలు ముసేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇదే విషయంపై వివరణ ఇస్తూ ట్వీట్ చేసారు. 

‘కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దు’ అనే ఆమె ట్వీట్ చేశారు.

కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌ వల్ల 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు ముసేయాలని సీఎం కేసీఆర్ మరియు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని, ఆ వార్తలను నమ్మవద్దని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) శ్రీ దేవసేన స్పష్టం చేసినట్టు హిందూ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ముఖ్యమంత్రి ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, విద్యా సంస్థలు యథావిధిగా పనిచేస్తాయని కూడా ఆమె స్పష్టం చేసారు. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వార్తలో నిజంలేదని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా 30 నవంబర్ 2021న పార్లమెంటులో మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 దేశాల్లో కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ని గుర్తించినప్పటికీ, భారతదేశంలో మాత్రం ఇంకా ఎటువంటి కేసులు నమోదుకాలేదని అన్నారు.

చివరగా, ఒమిక్రాన్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు బంద్ అని వస్తున్న వార్తల్లో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll