Fake News, Telugu
 

భారత దేశంలో నివసిస్తున్న 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతునట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్ ఫేక్

0

భారత దేశంలోని చర్చిలపై, క్రిస్టియన్ మిషనరీలపై హింసాత్మక దాడులు చోటుచేసుకుంటున్నాయి, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. “లాండియాలోని చర్చి కోసం ప్రార్థించండి. నిన్న రాత్రి 20 చర్చిలు కాలిపోయాయి. ఈ రాత్రి, వారు ఒలిసాబాంగ్ ప్రావిన్‌లోని 200 కి పైగా చర్చిలను నాశనం చేయాలనుకుంటున్నారు. రాబోయే 24 గంటల్లో 200 మంది మిషనరీలను చంపాలని వారు కోరుకుంటారు. క్రైస్తవులందరూ గ్రామాలుగా పోయారు. వారికోసం ప్రార్థించండి. ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిన క్రైస్తవులందరూ ఈ సందేశాన్ని పంపండి మరియు భారతదేశంలోని మా సహోదర సహోదరీలపై దయ చూపమని దేవుడిని కోరండి”,  అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత దేశంలో నివసిస్తున్న 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతునట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్

.ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో షేర్ చేసిన సందేశం కనీసం 2010 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. భారత దేశంలో ప్రాంతాలని రాష్ట్రాలు, జిల్లాల వారీగా విడదీసారు, ప్రావిన్సులగా విడదీయలేదు. భారత దేశంలో ఒలిసాబాంగ్ అనే పేరుతో ఎటువంటి జిల్లా లేదా నగరం లేదు. 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతున్నామని భారత దేశంలోని ఏ ఒక్క మత సంఘం హెచ్చరించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబందించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఇదే సమాచారాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి, పోస్టులో తెలిపిన సందేశం చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నట్టు స్పష్టమయ్యింది. అంతేకాదు, భారత దేశంలో ఒలిసాబాంగ్ అనే పేరుతో ఎటువంటి ప్రావిన్స్, జిల్లా లేదా నగరం లేదు. భారత దేశంలోని ప్రాంతాలని రాష్ట్రాలు, జిల్లాలుగా విడదీసారు, ప్రావిన్సులగా విడదీయలేదు.   

పోస్టులో షేర్ చేసిన ఈ మెసేజ్ కనీసం 2010 నుండి సోషల్ మీడియా లేదా, ఈ-మెయిల్స్ ద్వారా షేర్ చేస్తున్నట్టు తెలిసింది. భారత దేశంలో బౌద్ధ మతస్థులు క్రైస్తవులపై దాడులు జరిపి 20 చర్చిలని కూల్చివేసారని ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు, ‘Snopes’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ఈ విషయానికి సంబంధించిన స్పష్టత కోసం ‘India Gospel League’ అధికారి రేవ్ సామ్యుల్ స్టిఫేన్స్‌ను సంప్రదించింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ తప్పని సామ్యుల్ స్టిఫేన్స్‌ ‘Snopes’కు స్పష్టం చేసారు. సామ్యుల్ స్టిఫేన్స్‌ ‘Snopes’తో మాట్లాడుతూ, “ఒకవేళ ఈ మెసేజ్‌లో తెలిపిన సమాచారం వాస్తవమే అయివుంటే, భారత దేశంలో మాకున్న విస్త్రుతమైన పాస్టర్లు మరియు చర్చి పాస్టర్ల నెట్‌వర్క్‌కి, ఆ సమాచారం అందుకున్న మొట్టమొదట వ్యక్తులలో నేను కూడా ఒకడిగా ఉండేవాడిని. ఈ సందేశం బౌద్ధులు మరియు క్రైస్తవుల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడానికి హిందూ తీవ్రవాదులు ఉద్దేశపూర్వకంగా మరియు ప్రణాళికాబద్ధంగా చేసిన దుర్మార్గపు ప్రయత్నమని నేను నమ్ముతున్నాను. బౌద్ధ మరియు క్రైస్తవ మత వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే ఇలాంటి మెసేజేస్ షేర్ చేస్తున్నారు”, అని తెలిపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన మెసేజ్ తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో క్రైస్తవ చర్చిలపై, క్రైస్తవులపై దాడులు పెరిగాయని పలు విదేశీ వార్తా సంస్థలు అప్పట్లో కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ చూడవచ్చు. హిందువులని బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారనే ఆరోపణ మీద దేశంలోని పలు చర్చిలపై మరియు క్రైస్తవ మిషనరీలపై హిందూ సంఘాలు దాడులకు పాలుపడుతున్నట్టు ఇటీవల ‘The Guardian’ న్యూస్ సంస్థ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. కాని, 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతున్నామని హిందువులు లేదా దేశంలోని ఏ ఒక్క మత సంఘం క్రైస్తవులను హెచ్చరించలేదు.

చివరగా, భారత దేశంలో నివసిస్తున్న 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతునట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll