Fake News, Telugu
 

నర్సంపేట బస్టాండ్‌లో ఒక అమ్మాయి గురించి రెండు విద్యార్థి గ్యాంగులు గొడవ పడిన వీడియోని తప్పుడు ప్రచారంతో షేర్ చేస్తున్నారు

0

విధ్యార్ధినిని గర్భవతి చేసిన ఒక కీచక ఉపాధ్యాయుడికి ప్రజలు దేహశుద్ది చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: విధ్యార్ధినిని గర్భవతి చేసిన ఉపాధ్యాయుడికి ప్రజలు దేహశుద్ది చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల తెలంగాణాలోని నర్సంపేట బస్టాండ్‌లో ఒక అమ్మాయి గురించి రెండు విధ్యార్ధి వర్గాలు ఘర్షణ పడిన దృశ్యాలని చూపిస్తుంది. నర్సంపేట వొకేషనల్ కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిపై మనసుపడటంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగి ఈ గోడవకి దారి తీసింది. ఉపాధ్యాయుడు విద్యార్థినిని గర్భవతిని చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ 24 సెప్టెంబర్ 2022 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. నర్సంపేట బస్టాండ్‌లో రెండు విధ్యార్ధి వర్గాలు ఒక అమ్మాయి గురించి ఘర్షణ పడిన దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. నర్సంపేట వొకేషనల్ కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిపై మనసుపడటంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగి ఈ గొడవకి దారి తీసినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించి సీఐ పులి రమేష్ ఇటీవల మీడియాకి వివరణ ఇస్తూ, ఈ ఘటన 19 సెప్టెంబర్ 2022 నాడు చోటుచేసుకుందని, ఈ ఘర్షణలో పాలుపంచుకున్న విధ్యార్ధులని అదే రోజు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పాత వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని పులి రమేష్ మీడియాకి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’ వార్తా పత్రిక ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయుడు విధ్యార్ధినిని గర్భవతి చేసినందుకు ఈ ఘర్షణ  చోటుచేసుకున్నట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, నర్సంపేట బస్టాండ్‌లో ఒక అమ్మాయి గురించి రెండు స్టూడెంట్ గ్యాంగులు గొడవ పడిన వీడియోని తప్పుడు ప్రచారంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll